రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారులదే కీలక పాత్ర: జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీరాంపూర్లోని కొత్త రోడ్ పోచమ్మ గుడి వద్ద నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెను సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యల కంటే రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విచారకరమన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడమే ఈ అనర్థాలకు ప్రధాన కారణమని విశ్లేషించారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, వాహనదారులు వ్యక్తిగత బాధ్యతగా భావించి సహకరించినప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్లతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని ఏసీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీటు బెల్టు వాడాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడమే పోలీసు శాఖ ఆశయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్సైలు సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీస్ సిబ్బందితో పాటు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








