ధ్యాత్మిక శోభతో పులకించిన ఆలయ ప్రాంగణం
భక్తిశ్రద్ధలతో రుద్ర హోమం, అన్నప్రసాద వితరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పద్మశాలి సంఘం, లక్ష్మి గణపతి శివ మార్కండేయ మహదుర్గ దేవాలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఆలయ అర్చకులు రాంబట్ల ఆనంద్ శర్మ, సాత్విక్, ఆకాష్ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా రుద్ర హోమం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ, జై మార్కండేయ నినాదాలతో
ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీస్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్-ఉమారాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ ప్రతి ఏటా మార్కండేయ జయంతితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు భగవంతుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి యాజమాన్యం తరపున ఆలయ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం, ఆలయ కమిటీ అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, మాటేటి వెంకన్న, కొండా శ్రీనివాస్, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, పెరుమాండ్ల సరోజన, చిప్ప రాజబాబు, సబ్బని భాస్కర్, కటకం లక్ష్మణ్, ఆడేటి రాజన్న, కుందారపు రాములు, క్యాతం రాజేష్, ఆడేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








