ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీ, క్యాలెండర్‌ను రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం ఆవిష్కరించారు. మంచిర్యాలలోని తన నివాసంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై సంఘం ప్రతినిధులు మంత్రితో చర్చించారు.
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని గడియారం శ్రీహరి కోరారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో, ఇక్కడి ఉద్యోగులకు 17 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఎన్జీవో రూపొందించిన డైరీలోని అంశాలు ఉద్యోగుల విధి నిర్వహణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, కేజియా రాణి, పద్మలత, నరేందర్, శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్, వివిధ యూనిట్ల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, వెంకటేష్, సుమన్, అభిషేక్, పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్, కుమార్, మోసిన్, ప్రణవనందు, సరిత తదితరులు హాజరయ్యారు.







