- శ్రీరాంపూర్‌లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ శ్రీలత పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం బస్టాండ్ ఏరియా వద్ద రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, సింగరేణి కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెను సమస్యగా మారాయని, ప్రధానంగా వాహనదారులు నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని శ్రీలత పేర్కొన్నారు. సమాజంలో జరిగే హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టగలమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు ఇతరుల ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, సురక్షిత ప్రయాణంతో ప్రతి ఒక్కరూ ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మేకల సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








