- తెలంగాణ రాష్ట్ర పర్యావరణ రక్షణ వాల్టా అథారిటీ సభ్యుడు, సైకాలజిస్ట్ గుండేటి యోగేశ్వర్
- గుడిపేట కేంద్రీయ విద్యాలయంలో ‘హరిత పాఠశాల – వ్యక్తిత్వ వికాసం’పై అవగాహన సదస్సు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పాఠశాలలను పర్యావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దినప్పుడే ప్రశాంత వాతావరణం ఏర్పడి విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారుని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ రక్షణ వాల్టా అథారిటీ సభ్యుడు, సైకాలజిస్ట్ గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం ‘హరిత పాఠశాల – విద్యార్థుల బాధ్యత – వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి గుండేటి యోగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతి రక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని యోగేశ్వర్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పర్యావరణ క్లబ్బుల నిర్వహణ, విద్యార్థుల భాగస్వామ్యంపై ప్రాక్టికల్ పద్ధతుల్లో అవగాహన కల్పించారు. విద్యార్థులను వివిధ బృందాలుగా విభజించి శిక్షణ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ఒత్తిడి మేనేజ్మెంట్ పై కీలక సూచనలు చేశారు. సమయ పాలన, ఏకాగ్రత, లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. పరీక్షల పట్ల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ డాంగే, సమన్వయకర్త ఎస్. భాస్కర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చైతన్య, లోకేష్, నాగరాణి, సాయి లీల, ఎం.శరత్ చంద్ర, బి.రాజశేఖర్ సహా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








