నస్పూర్, ఆర్.కె న్యూస్: పట్టణంలోని రామ్ నగర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు (సీతారాంపల్లి శాఖ) ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నరసింహ స్వామి ఖాతాదారులకు పలు ప్రభుత్వ బీమా పథకాలు, డిజిటల్ లావాదేవీల భద్రతపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 18-70 ఏళ్ల వారు ఏడాదికి రూ.20 చెల్లిస్తే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా అందుతుందని, జీవనజ్యోతి బీమా యోజన పథకంలో 18-50 ఏళ్ల వారు ఏడాదికి రూ.436 చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుందని, అటల్ పెన్షన్ యోజన పథకంలో 18-40 ఏళ్ల లోపు వారు చేరితే, 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చని, చందాదారుడి మరణానంతరం భార్యకు, ఆ తర్వాత పిల్లలకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకు ఏటీఎం కార్డు కలిగి ఉన్నవారికి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ పాస్వర్డ్లు, ఓటీపీలు చెప్పకూడదని మేనేజర్ సూచించారు. అపరిచిత ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని కోరారు. అనంతరం రమేష్ కల్చరల్ అసోసియేషన్ కళాకారులు పాటలు, మ్యాజిక్ షో ద్వారా బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, సుధ, పరిమళ, సునీత, అంజయ్య, సత్తన్న, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
3 January 2026
మంచిర్యాల లక్ష్మీనగర్ కాలనీలో నివాళులర్పించిన నాయకులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 28వ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో శనివారం సావిత్రీబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త అయిన సావిత్రీబాయి చిత్రపటానికి కాలనీ వాసులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అజ్ఞానంలో ఉన్న సమాజంలో జ్ఞానదీపాన్ని వెలిగించిన మహనీయురాలు సావిత్రీబాయి అని కొనియాడారు. ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. స్త్రీల హక్కుల సాధన కోసం, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య, రాజిరెడ్డి, రాజేశం, లక్ష్మణ్, బాబు, ఎల్లయ్య, శ్రీనివాస రెడ్డి, సత్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
వేమనపల్లి, ఆర్.కె న్యూస్: మండల బిజెపి అధ్యక్షుడిగా ఏట రవికుమార్ నియమితులయ్యారు. శనివారం చెన్నూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈ మేరకు రవికుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మాజీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుమారుడే రవికుమార్. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. మండలంలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం: నూతన ఎస్హెచ్ఓ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై ఎం. ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీసీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు సిసిసి నస్పూర్ ఎస్హెచ్ఓగా కొనసాగిన యు. ఉపేందర్ రావు రామగుండం టాస్క్ ఫోర్స్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వాహనదారులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్హెచ్ఓ సూచించారు. ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, స్టేషన్ సిబ్బంది నూతన ఎస్హెచ్ఓకు సాదర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7 గంటలు దాటినా రహదారులపై కనీసం ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనాలకు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో, ఒక్కసారిగా ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాలను తలపించేలా వాతావరణం మారడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
కార్మికులు, వాహనదారుల ఇబ్బందులు
శనివారం ఉదయం కురిసిన భారీ పొగమంచు కారణంగా జనజీవనం కొంత మేర అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఉదయం షిఫ్ట్ విధులకు హాజరయ్యే సింగరేణి కార్మికులు, పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తంటాలు పడ్డారు. అయితే, అరుదుగా కనిపించే ఈ వాతావరణాన్ని చూసి కొంతమంది యువత, స్థానికులు సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు.
ఆందోళన కలిగిస్తున్న గాలి నాణ్యత
మరోవైపు, ఈ పొగమంచు వెనుక పర్యావరణ ముప్పు పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గాలి నాణ్యత సూచీ ఆన్లైన్లో ‘పూర్’ ఉన్నట్లు చూపించడం చర్చనీయాంశమైంది. తరచూ దేశ రాజధాని ఢిల్లీలో కనిపించే కాలుష్య వాతావరణం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న మానవ జీవన విధానం, పెరుగుతున్న వాతావరణ కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
ప్రస్తుత పరిస్థితులపై పర్యావరణవేత్తలు స్పందిస్తూ.. పర్యావరణ వినాశనం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అడవుల పెంపకం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పిలుపునిచ్చారు.




