తిరుపతిలో పురస్కారాన్ని అందజేసిన బహుజన సాహిత్య అకాడమీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన సింగరేణి ఉద్యోగి యుగేందర్ సాయి జాతీయ స్థాయి ‘బెస్ట్ సోషల్ వర్కర్’ అవార్డును అందుకున్నారు. తిరుపతిలో ఈ నెల 15న నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సామాజిక సేవా రంగంలో ఆయన కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తింపుగా అకాడమీ ఈ గౌరవాన్ని అందించింది. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా యుగేందర్ సాయి ఈ అవార్డును స్వీకరించారు. కోవిడ్ 19 విపత్తు సమయంలో బాధితులకు అవసరమైన సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్నారు. మహనీయుల ఆశయాలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్తూ సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. యుగేందర్ సాయి సామాజిక సేవలతో పాటు విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న బహుముఖ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.



