రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ వినయ్ కుమార్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రైతుల వద్ద నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలలో వేసవి ఉష్ణోగ్రతతో పాటు ఇతర రాష్ట్రాలలో కొనసాగుతున్న ఎన్నికల సందర్భంగా హమాలీల కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితులలో సైతం జిల్లాలో రోజుకు 150 లారీల ధాన్యం తరలించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యం త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆలోచన మేరకు జిల్లాలో గోదాములను అద్దెకు తీసుకుని కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీల ద్వారా అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో సంబంధిత నగదును జమ చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళలలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా చేయడం జరిగిందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా గోదాములలో నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ తో కలిసి చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో పట్టణ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటు పనులను వేగవంతం చేసి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో చెన్నూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన రహదారి విస్తరణ, మురుగు కాలువల వ్యవస్థ నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల కారణంగా ఎవరికి ఎలాంటి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రహదారి విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలు కేటాయించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, స్థలం కోల్పోయిన వారికి టి డి ఆర్ లో వెసులుబాటు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో అనవసర పుకార్లను నమ్మవద్దని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



