- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నిర్దేశిత ఉత్పత్తి, ఉత్పాదకత సాధనే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆర్.కె 7 భూగర్భ గని, జీఎం కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కెట్ పోటీ తట్టుకుని సంస్థను లాభాల బాటలో నడపడానికి ఉద్యోగులు కార్యోన్ముఖులు కావాలని స్పష్టం చేశారు. కొత్త గనులు రాకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతోందని మునిగంటి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లోపాల వల్ల సింగరేణి బొగ్గుకు డిమాండ్ తగ్గుతోందని వివరించారు. ఇప్పటికే టన్నుకు దాదాపు 700 రూపాయలు తగ్గించడం వల్ల ఏడాదికి 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. యంత్రాల వినియోగ సమయాన్ని పెంచుకుంటూ సంస్థ ఉనికిని కాపాడాలని కోరారు. ఉద్యోగుల ఉపాధి కేంద్రాలైన భూగర్భ గనుల జీవిత కాలాన్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. జీఎం కార్యాలయంలోని సపోర్టింగ్ డిపార్ట్మెంట్లు ఎలాంటి తాత్సారం లేకుండా విధులు నిర్వహిస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు దోహదపడాలని సూచించారు. ఎస్‌ఓటూ జీఎం కన్వీనర్‌గా రెండు బృందాలు ఏరియా పరిధిలోని అన్ని గనులు, విభాగాలలో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆర్.కె 7 గనిలో మూడు షిఫ్టుల ఉద్యోగులకు టీం-1 ప్రతినిధులు సంస్థ ఆర్థిక పరిస్థితులు, గని స్థితిగతులపై అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై డీజీఎం (ఐఈడీ) రాజన్న, ఆర్థిక వ్యవహారాలపై ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, నాణ్యత ప్రాధాన్యతపై హనుమాన్ గౌడ్, రక్షణపై ఏఎస్ఓ విజయ్ కుమార్, సంక్షేమంపై డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ లోటుపాట్లను వివరించారు. సంస్థ సవాళ్లపై కమిటీ కన్వీనర్ ఎస్‌ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. సంస్థ మనుగడే లక్ష్యంగా విధులు నిర్వహించాలని గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి సెక్రటరీ మోతుకూరి కొమురయ్య కోరారు.
జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్నల్ ఆడిట్, డిస్పెన్సరీ సిబ్బందికి టీం-2 ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గనుల్లో ఉత్పత్తి సాధన దిశగా సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని అవగాహన కల్పించారు. ఈఈ (ఐఈడీ) సాయికిరణ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కృష్ణారావు, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ నరేష్, అడిషనల్ మేనేజర్ మహేష్, అడిషనల్ మేనేజర్ అమర్నాథ్, డీవై పీఎం రాజేష్ వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిట్ సెక్రటరీ సందీప్ కోరారు. కాగా, మంగళవారం టీం-1 ఆధ్వర్యంలో ఎస్ఆర్పీ 3 గనిలో, టీం-2 ఆధ్వర్యంలో ఎస్ఆర్పీ 1 గనిలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు జరగనున్నాయి.



