- సేవా సమితి అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి
- శ్రీరాంపూర్ ఎస్సీఓఏ క్లబ్లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికీ నిరంతర యోగా సాధన ఎంతో ముఖ్యం. ఈసారి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో (థీమ్) అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించటం ఆహ్వానించదగ్గ పరిణామమని సేవా సమితి అధ్యక్షురాలు, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ మునిగంటి ఉమారాణి పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీఓఏ క్లబ్లో ఆదివారం మహిళలకు ప్రత్యేక యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మునిగంటి ఉమారాణి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, సింగరేణి అధికారుల సతీమణులు ఉత్సాహంగా వివిధ రకాల యోగాసనాలను సాధన చేశారు. వయసు పెరుగుతున్నప్పటికీ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి నిత్యం యోగా చేయడం ఎంతో అవసరమని మునిగంటి ఉమారాణి స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. సంస్థలోని అన్ని ఏరియాలలో ఖర్చుకు వెనుకాడకుండా ప్రత్యేకంగా యోగా సాధన కోసం సెంటర్లను ఏర్పాటు చేసి యోగాను నిరంతరం ప్రోత్సహిస్తోందని కొనియాడారు. ఈ అవకాశాన్ని సింగరేణి పరిసర ప్రాంతాల మహిళలు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రెటరీ దివ్యతో పాటు పెద్ద సంఖ్యలో సింగరేణి అధికారుల సతీమణులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.



