- యంత్రాల పనిగంటలు పెంచి సంస్థ అభ్యున్నతికి పాటుపడాలి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌లో 12 టన్నుల నూతన క్రేన్ ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏరియా వర్క్‌షాప్ పాత్ర కూడా ఎంతో కీలకమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఏరియా వర్క్‌షాప్‌లో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 12 టన్నుల క్రేన్ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అన్ని భూగర్భ, ఉపరితల గనులకు అవసరమైన యంత్రాల నిర్వహణ, మరమ్మతులు సక్రమంగా జరగాలని సూచించారు. ఎలాంటి తాత్సారం లేకుండా సకాలంలో సంబంధిత గనులకు యంత్రాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రతి ఒక్కరు నిబద్ధతతో కృషి చేయాలని వర్క్‌షాప్ అధికారులు, ఉద్యోగులను కోరారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ క్రేన్‌తో పాటు ఇతర భారీ వాహనాలు, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మునిగంటి శ్రీనివాస్ సూచించారు. యంత్రాల పనిగంటలను పెంచి సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్‌తో పాటు ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (వర్క్‌షాప్) కృష్ణారెడ్డి, డీవై సీఎంఓ రమేష్ బాబు, పిట్ సెక్రటరీ సదానందం, సంక్షేమ అధికారి రమేష్ నాయక్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.



