మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఆర్ఎస్వీ ధర్నా
జేసీ చంద్రయ్యకు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్. కె న్యూస్: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకులు సోమవారం భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాయింట్ కలెక్టర్ చంద్రయ్యను కలిసి జీవో నం. 97 రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం. 97 కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని మండిపడ్డారు. గతంలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం (ఈసెట్ ద్వారా) పొందేవారని, అయితే ప్రస్తుత జీవో వల్ల ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థుల అమూల్యమైన సమయం వృథా కావడంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ మనలేకపోయాయని, తక్షణమే జీవోను రద్దు చేయకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




