నస్పూర్ శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద పూజలు నిర్వహించిన మేయర్ ధర్ని మధుకర్
ఘనంగా నిమజ్జన శోభాయాత్ర
నస్పూర్, ఆర్.కె న్యూస్: “గణపతి బప్పా మోరియా.. పుడ్చ్యా వర్షి లవ్కర్ యా” అంటూ భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక పాటలు, నృత్యాల కోలాహలం నడుమ నస్పూర్ పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న ఆదిదేవునికి గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. పట్టణంలోని
శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు సముద్రాల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు మేయర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో నగర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు కాలనీల్లో భక్తిభావం, ఐక్యత వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించిన మండలి సభ్యులను, భక్తులను అభినందించారు. మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ లక్కీ డ్రాలో మంచిర్యాలకు చెందిన టి. ప్రశాంత్‌కు పవిత్ర లడ్డూ ప్రసాదం దక్కింది.
అనంతరం మామిడి తోరణాలు, పూలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన లారీలో గణనాథుని ప్రతిమను ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. యువతీ యువకులు సంప్రదాయ వస్త్రధారణతో భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ, గులాలు చల్లుకుంటూ ఉత్సాహంగా అడుగులు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాలు స్వీకరించారు. నిమజ్జనానికి సంబంధించి ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద, గూడెం వద్ద అధికారులు క్రేన్లు, విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లతో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతినిధులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్‌రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, బేర సత్యం, చిందం రాజు, చందా శ్రీనివాస్, మండల శివ, చందా శివ, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




