- నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి సుజాత
సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత పర్యటించి రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నందున యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, నీటి కొరతను అధిగమించేందుకు రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుని, నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్‌ను సందర్శించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువులు మరియు జీవ నియంత్రణ ఉత్పత్తుల వినియోగంపై పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ రాజశేఖర్ రెడ్డి, రవి, మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







