నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలం షిర్కే కాలనీలో వినాయక చవితి చందాల లెక్కల విషయమై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఈ నెల 23న నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా సీసీసీ కార్నర్ వద్ద కంచర్ల రమేష్, ఆయన సోదరుడు వెంకటేష్‌లపై దొమ్మటి రాజేందర్, గుర్రాల వంశీకృష్ణ దాడి చేశారు. ఈ ఘటనను మనసులో పెట్టుకుని, 24వ తేదీ అర్ధరాత్రి కంచర్ల రమేష్ తన స్నేహితులతో కలిసి రాజేందర్ ఇంటిపై కర్రలతో దాడి చేసి రాజేందర్‌తో పాటు ఆయన స్నేహితులు జగన్, రమేష్‌లను గాయపరిచారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. శుక్రవారం ఇరువర్గాలకు చెందిన వారిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ తెలిపారు. పట్టణంలో గ్రూపు తగాదాలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
25 September 2026
సోన్, ఆర్.కె న్యూస్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సోన్ మండలంలోని పాక్‌పట్లకు చెందిన పొల్కమ్ ఉదయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకం ఉంచి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బీజేఎల్పీ నాయకులు, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్, నిర్మల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డికి ఈ సందర్భంగా పొల్కమ్ ఉదయ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. అవసరమైన మందులు అందజేశారు. చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాత టైర్లు, కూలర్లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధి అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయినాథ్, ఆశా వర్కర్లు సరోజ, సుజాత, రాధా, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుంటాల శంకర్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన కుంటాల శంకర్ శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలను
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శంకర్‌ను శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుంటాల శంకర్ మాట్లాడుతూ, పార్టీలో తనపై నమ్మకం ఉంచి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కొక్కిరాల సురేఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దళితుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




