మంచిర్యాల/హైదరాబాద్ ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ హిప్నాసిస్ రంగ నిపుణులు శేశి కిరణ్ చెఱకు ఇండియన్ హిప్నాసిస్ కౌన్సిల్ జాతీయ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్లో ఘనంగా నిర్వహించిన నేషనల్ హిప్నాసిస్ సమ్మిట్‌లో ఇండియన్ హిప్నాసిస్ కౌన్సిల్‌ను అధికారికంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన
వ్యక్తి జాతీయ స్థాయిలో అత్యున్నత బాధ్యతలు చేపట్టడం స్థానికంగా తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాతీయ సమ్మిట్‌కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ హిప్నాటిస్టులు, హిప్నోథెరపిస్టులు, ట్రైనర్లు, మానసిక ఆరోగ్య నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికగా ఇండియన్ హిప్నాసిస్ కౌన్సిల్ ఆవిర్భావంతో పాటు జేమ్స్ ఎస్డైల్ అవార్డ్స్ – 2026 ప్రదానోత్సవం, జాతీయ హిప్నాసిస్ దినోత్సవ ప్రతిపాదన కార్యక్రమాలు జరిగాయి. 1846 నవంబర్ 4న డాక్టర్ జేమ్స్ ఎస్డైల్ చేపట్టిన పరిశోధనల చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ 4ను ‘జాతీయ హిప్నాసిస్ దినోత్సవం’గా నిర్వహించాలని శేశి కిరణ్ ప్రతిపాదించగా, సదస్సులోని నిపుణులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా హిప్నాసిస్ రంగానికి పటిష్టమైన వేదికను నిర్మించి, వృత్తిపరమైన ప్రమాణాలు, శిక్షణ, సర్టిఫికేషన్, పరిశోధనలు మరియు ప్రజల్లో అవగాహన పెంచేలా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించనున్నట్లు కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం. రామచందర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ నెక్కలపు, హోమియోపతి నిపుణులు డాక్టర్ చాణక్య, ప్రొఫెసర్ కళ్యాణ లక్ష్మి, ఆర్జే స్వాతి, ప్రొఫెషనల్ హిప్నోథెరపిస్ట్ ఎం.ఎల్. రాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన శేశి కిరణ్ చెఱకుకు మంచిర్యాల జిల్లా ప్రముఖులు, మేధావులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
4 November 2026
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా
పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం కుదుర్చుకున్న 24 డిమాండ్ల ఒప్పందాన్ని తక్షణమే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలి” అని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం తాము సమ్మె నోటీసు ఇవ్వడంతో లేబర్ కమిషన్ సమక్షంలో యాజమాన్యం 24 డిమాండ్లపై ఒప్పందం చేసుకుందని, కానీ వాటి అమలులో తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్ అభ్యర్థులకు పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను వెంటనే అందజేయాలన్నారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహిస్తామని ఒప్పందంలో పేర్కొని.. కేవలం మూడు నెలలు మాత్రమే నిర్వహించి అర్ధాంతరంగా నిలిపివేయడం సరికాదని, వెంటనే బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మారుపేర్ల సమస్యతో పెండింగ్‌లో ఉన్న అర్హులైన అభ్యర్థులందరికీ, ప్రత్యేకించి 35 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వారికి నిబంధనల ప్రకారం వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా సొంత ఇంటి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు గనుల్లో కార్మికుల రక్షణ కోసం బూట్లు, హెల్మెట్లు, డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు, యంత్రాల స్పేర్ పార్టులను వెంటనే సరఫరా చేయాలని కోరారు. అలాగే జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సంస్థకు రావాల్సిన రూ. 59 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ఏరియా కార్యదర్శి సంపత్, జిల్లా కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, గొర్రె నర్సయ్య, గండి సతీష్, సురేష్, పిట్ కార్యదర్శులు గుణిగంటి నర్సింగారావు, సారయ్య, మోతే లచ్చన్న, నవీన్ రెడ్డి, సదానందం, అగు శ్రీకాంత్, గజ్జి రమేష్, పెద్ద సంఖ్యలో డిపెండెంట్ అభ్యర్థులు, కార్మికులు పాల్గొన్నారు.

తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా వి. అనిల్ రెడ్డి నియామకం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వి. అనిల్ రెడ్డి నియమితులయ్యారు. సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన, ప్రస్తుతం కార్మిక సంఘం హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత, ఆయనను మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ రెడ్డి నియామకం పట్ల పార్టీ శ్రేణులు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ… తనపై పూర్తి నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిప్పారపు సారయ్యకు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.



