ఈ నెల 4న లఘు చిత్రం ప్రదర్శన
వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మాణం: దర్శకుడు విష్ణు చిప్పకుర్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ప్రాంతంలోని వాస్తవ సంఘటనలు, ఒక కార్మికుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సందేశాత్మక లఘు చిత్రం ‘కారుణ్య’. విష్ణు చిప్పకుర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 4వ తేదీన మంచిర్యాలలోని ఎస్‌వీసీ థియేటర్‌లో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు విష్ణు చిప్పకుర్తి మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. ఒక సింగరేణి కార్మికుడు తన కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని ఎన్నో కలలు కంటాడని, ఆ కొడుకు భవిష్యత్తు ఏమైందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని వివరించారు. ఆ కార్మికుడి కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను తెరపై చూడాల్సిందేనన్నారు. ఇదొక మంచి సందేశాత్మక చిత్రమని, కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని దర్శకుడు విష్ణు కోరారు. ఈ చిత్రంలో జబర్దస్త్ దమ్మాల శ్రీనివాస్, రాధిక, మూడుగుల స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఫ్లోబి, నవీక్ పటేల్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటులు జబర్దస్త్ దమ్మాల శ్రీనివాస్, అర్జున్ ప్రసాద్, అనిల్, కెమెరామెన్‌లు ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.








