రాజకీయ అధికారంతోనే సామాజికాభివృద్ధి సాధ్యం
తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం
మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: రానున్న మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులు తమ ఐక్యతను చాటి రాజకీయ సత్తా చూపాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన కులస్థుల ఆత్మీయ సమ్మేళనం, సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2026 క్యాలెండర్‌ను జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సత్తన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు.
సమావేశంలో రాజారాం మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉండగా, అందులో మున్నూరు కాపుల వాటా 18 శాతంగా ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోనే సుమారు 70 వేల మంది ఓటర్లు ఉన్నారని, దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఐక్యత ద్వారానే రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాపు ప్రతినిధులను గెలిపించుకోవాలని కోరారు.
మున్నూరు కాపులను సమన్వయం చేయడంలో ఈ క్యాలెండర్ వారధిగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీపతి బాపురావు, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు పెంచాల వేణు, పెద్దపల్లి కోటిలింగం, ధర్ని మధుకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, నాయకులు పడాల రవీందర్, పూదరి కుమార్, పానగంటి వినయ్, ఆకుల లక్ష్మణ్, రాళ్లబండి రాజన్న తదితరులు పాల్గొన్నారు.








