కనువిందు చేసిన వర్ణ శోభిత రంగవల్లులు; విజేతలకు బహుమతుల అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్ రోడ్డులోని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ముగ్గుల పోటీలు వైభవంగా జరిగాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటారు. నేలపై ఇంద్రధనస్సు ఆవిష్కరించినట్లుగా రంగురంగుల రంగవల్లులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలనీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా, బీసీ సంక్షేమ అధికారిణి భాగ్యలక్ష్మి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
మహిళలు వేసిన సందేశాత్మక ముగ్గులు సమాజానికి దిశానిర్దేశం చేసేలా ఉన్నాయని అతిథులు కొనియాడారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో కాలనీలో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాలనీలో కేటాయించిన స్థలంలో త్వరలోనే దేవాలయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. టీఎన్జీవోస్ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే సంక్రాంతి పండుగలో ముగ్గులు వేయడం అనేది కేవలం కళ మాత్రమే కాదని, అది మహిళల నైపుణ్యానికి గుర్తింపు అని పేర్కొన్నారు. సంక్రాంతి సమయంలో వేకువజామునే ముగ్గులు వేయడం వల్ల సూర్యకిరణాలు శరీరానికి తగిలి ఆరోగ్యంతో పాటు చక్కని వ్యాయామం లభిస్తుందన్నారు. పండుగలు కుటుంబాల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని వివరించారు. రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎండి హబీబ్ హుస్సేన్ కాలనీ అభివృద్ధికి జరుగుతున్న కృషిని అభినందించారు.
పోటీల విజేతలు: ముగ్గుల పోటీల్లో జి పద్మ ప్రథమ స్థానం సాధించి రూ.3000 నగదు బహుమతి గెలుచుకోగా, కే జ్యోతిక ద్వితీయ (రూ.2000), ఈ భార్గవి తృతీయ (రూ.1000) స్థానాల్లో నిలిచారు. జి సప్న, సుకన్య ప్రత్యేక బహుమతులు సాధించారు. బాలికల విభాగంలో ఆర్ శాస్త్ర, ఎస్ ఆరాచి, పి అక్షర, జి శాన్విక ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు. బాలికల విభాగం బహుమతులను పుప్పాల జ్యోతి హనుమంతరావు స్పాన్సర్ చేశారు. సీహెచ్ జ్యోతి, ఎం రాధ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ వేడుకల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. హనుమంతరావు, జిల్లా నాయకులు భూముల రామ్మోహన్, కస్తూరి నాగేశ్వర్, శ్రీపతి బాపురావు, సైండ్ల మొండయ్య, యూనిట్ అధ్యక్షుడు గోపాల్, మహిళా ప్రతినిధులు ఏ. సునీత, కేజీయ రాణి, డి. కమల, బి. కళావతి, స్వర్ణలత, స్వప్న, నాయకులు తిరుపతి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








