- టికెట్లు కేటాయించకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని పద్మశాలి సంఘం తీర్మానం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలో తీర్మానించారు. భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ సహా చెన్నూర్, లక్షెట్టిపేట, క్యాతన్ పల్లి, బెల్లంపల్లి ఎన్నికలపై చర్చించారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తమ కులస్తులకు గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ సామాజిక వర్గ నాయకులకు కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకవేళ రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించని పక్షంలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల సహకారంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని, ‘మన ఓటు మనోళ్లకే’ నినాదంతో ఆయా వార్డుల్లో ఐక్యంగా పోటీ చేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బాపూజీ స్ఫూర్తితో పోరాడతామని ఈ సందర్భంగా ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు బూర్ల జ్ఞాని, కార్యదర్శి అంకం చంద్రయ్య, రాజేశం, నాయకులు సత్యనారాయణ, దామోదర్, రమేష్, లక్ష్మణ్, రామస్వామి పాల్గొన్నారు.







