- క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించిన నాయకులు.. మేనేజర్‌కు వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గనిని బుధవారం ఏఐటీయూసీ నాయకులు సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గనిలోని ప్రతి విభాగాన్ని తిరుగుతూ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను నాయకులు స్వయంగా గుర్తించారు. నాణ్యమైన హ్యాండ్ గ్లౌజెస్ పంపిణీ చేయకపోవడం వల్ల కార్మికులు తరచూ గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని డ్రిల్ బిట్లు త్వరగా విరిగిపోతున్నాయని, వెంటనే మెరుగైన పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. చలికాలం ముదురుతున్నా కార్మికులకు ఇవ్వాల్సిన గరీంకోట్లు (స్వెటర్లు) ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. సపోర్ట్ మెన్లు, ట్రామర్ల కోసం ప్రత్యేక గదులను నిర్మించాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రతి కార్మికుడికి లాకర్ తో కూడిన కబోర్డుల సౌకర్యం కల్పించాలని సూచించారు. కొత్తగా చేరిన ట్రేడ్స్మెన్లకు అవసరమైన టూల్స్, హెల్పర్లను కేటాయించాలని కోరారు. దుమ్ము నివారణకు ఎస్ అండ్ పీసీ గేటు నుండి గని వరకు నిరంతరం నీటిని స్ప్రే చేయాలని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో తగినంత మంది కార్మికులను నియమించి నాణ్యమైన బూట్లు సరఫరా చేయాలన్నారు. ఈ సమస్యలపై గని మేనేజర్‌ను కలిసి కలిసి కార్మికుల సమస్యలను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏరియా సెక్రటరీ అడ్డు శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరితో పాటు పిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, ప్రతినిధి రాజ్ కుమార్, నాయకులు బానేష్, పవన్, నాగరాజు, రవితేజ, కుమారస్వామి, పైడి పాల్గొన్నారు.








