🛑 శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆర్.కె 7, ఆర్.కె న్యూ టెక్, ఎస్ఆర్పీ 1 గనుల ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా గనుల ఉద్యోగులు రాబోయే కాలంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియా ప్రగతిపై ఆయన ప్రకటన విడుదల చేస్తూ జనవరిలో 5,73,700 టన్నుల లక్ష్యానికి గాను 2,32,279 టన్నుల బొగ్గు వెలికితీసి 40 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఏరియాలోని ఆర్.కె 7, ఆర్.కె న్యూ టెక్, ఎస్ఆర్పీ 1 గనులు వంద శాతానికి పైగా బొగ్గును వెలికితీశాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆర్.కె న్యూ టెక్ గని 113 శాతం ప్రగతిని నమోదు చేసిందని తెలిపారు. ఆర్.కె 5, ఆర్.కె 7, ఎస్సార్పీ 1 గనులు కూడా పూర్తి స్థాయి లక్ష్యాన్ని సాధించే దిశగా ఉన్నాయని వెల్లడించారు. ఉపరితల గనులలో మట్టి వెలికితీత కాంట్రాక్టర్ల ఒప్పంద సమస్యల వల్ల ఉత్పత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. శ్రీరాంపూర్ ఉపరితల గనిలో హెచ్సీపీఎల్ కొత్త కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టి ప్రతిరోజూ సగటున 37 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగిస్తోందని వివరించారు. రెండో కాంట్రాక్టుకు సంబంధించి సాంకేతిక బిడ్ ప్రక్రియ పూర్తయిందని, ధరల బిడ్ తెరిచి త్వరగా పనులు మొదలుపెడతామని తెలిపారు. ఇందారం ఉపరితల గనిలో పాత కాంట్రాక్టర్ యంత్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యమవడంతో నూతన కాంట్రాక్టు కోసం ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా మెడికల్ ఇన్ వాలిడేషన్ పొందిన 3,882 మంది వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించారు. మరో 275 మందికి ఎల్ఎస్పీ, 13 మందికి ఎంఎంసీ నిధులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన 9,729 మంది మాజీ ఉద్యోగులకు సీపీఆర్ఎంఎస్ కింద వైద్య కార్డులు అందజేశామని చెప్పారు. ప్రగతి స్టేడియంలో 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద యాజమాన్యం ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగిందని మునిగంటి శ్రీనివాస్ వివరించారు.







