- సేవా అధ్యక్షురాలు శివకుమారి చిరంజీవి
- ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం
- శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
జైపూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సేవా సమితి ద్వారా ప్లాంటు ప్రభావిత గ్రామాల యువత, మహిళల కోసం అనేక రకాల ఉపాధి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని సేవా (సింగరేణి ఎంప్లాయిస్ వైఫ్స్ అసోసియేషన్) అధ్యక్షురాలు శివకుమారి చిరంజీవి అన్నారు. గురువారం జైపూర్ ఎస్టీపీపీలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రభావిత గ్రామ మహిళలకు ఉచిత కంప్యూటర్ డి.టి.పి. శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి శివకుమారి చిరంజీవి, సేవా గౌరవ అధ్యక్షురాలు ఆశ నరసింహ రావు ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణను ప్రారంభించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం (పీసీఎస్, ఓ అండ్ ఎం) మదన్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు.
మహిళలు ఇటువంటి ఉపాధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని తమ జీవితంలో పైకి ఎదగాలని శివకుమారి చిరంజీవి ఆకాంక్షించారు. గతంలో టైలరింగ్, బ్యుటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా తరగతులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. మెజారిటీ యువత కోరిక మేరకు మొదటిసారి ఇక్కడ కంప్యూటర్ డి.టి.పి. శిక్షణ ప్రారంభించినట్లు వివరించారు. అనంతరం 2024-25 సంవత్సరంలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, ఖాదీ గ్రామోద్యోగ్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రటరీ నీలిమా పంతుల, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ పంతులా, ఏఐటీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ జోగు పర్శయ్య, డీజీఎం (పర్సనల్) కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, సేవా సమితి కో-ఆర్డినేటర్ అరుణ, కంప్యూటర్ శిక్షకుడు రాజ్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు, మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








