-
మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
-
9వ డివిజన్లో అభ్యర్థి సురిమిల్ల సౌమ్య తరఫున కార్నర్ మీటింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల కార్పొరేషన్లో 60 మంది కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి, కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల చరణ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వినాయక టౌన్ షిప్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు 9వ డివిజన్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సురిమిల్ల సౌమ్య-వేణును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 9వ డివిజన్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలోనే మంచిర్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలపడానికి ఎమ్మెల్యే కష్టపడుతున్నారని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నట్లు వివరించారు. డివిజన్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








