- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
- మంచిర్యాలలో ఘనంగా సాయుధ పోరాట తొలి అమరుడి జయంతి వేడుకలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడి త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. దొడ్డి కొమురయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కడవెండి గ్రామంలో జన్మించారు. గొల్ల కురుమ వర్గానికి చెందిన ఈ యువకుడు భూస్వాములు, రజాకర్ల అక్రమ కట్టుబాటు వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేశారు. నిజాం పాలనలో దేశ్ ముఖ్ లు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేపట్టిన సమయంలో కొమురయ్య కీలక పాత్ర పోషించారు. కడవెండి పరిసర గ్రామాల్లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతు ప్రజా సంఘాలను ఏర్పరిచారు. వెట్టి చాకిరి, అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలను ముందుండి నడిపారు. సాయుధ పోరాట యోధుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, చంద్రగిరి చంద్రమౌళి, గోలివాడ నర్సింహులు, కీర్తి రవి, వేముల అశోక్, అంకం సతీష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.







