- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్
- జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఏకారి లిఖిత తల్లిదండ్రులకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తల్లిదండ్రుల కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పేర్కొన్నారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు
చెందిన ఏకారి లిఖిత జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా శనివారం ఆమె తల్లిదండ్రులు వెంకటేష్, లక్ష్మిలను సమితి నాయకులు ఘనంగా సత్కరించారు. సిసిసి కార్నర్ ప్రాంతంలో రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబం తమ బిడ్డను ఉన్నత స్థాయికి చేర్చడం అభినందనీయమని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలను తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన ఈ తల్లిదండ్రులను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి. తల్లిదండ్రుల శ్రమను కళ్లారా చూసిన లిఖిత పట్టుదలతో చదివి జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాన్ని సాధించింది. నేటి యువత లిఖితను ఆదర్శంగా తీసుకోవాలి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత విద్యను అభ్యసించాలి. సొంతంగా ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాన్ని ముద్దాడాలని సూచించారు. యువతకు మార్గదర్శకంగా నిలిచిన లిఖితను సమితి ప్రతినిధులు అభినందించారు. లిఖిత సాధించిన ఈ విజయం జిల్లాలోని బీసీ సామాజిక వర్గ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక వేముల, మంచర్ల సదానందం, పంపరి వేణుగోపాల్, చంద్రగిరి చంద్రమౌళి, రాజు పాల్గొన్నారు.







