- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
- సృష్టి నవోదయ సైనిక్ స్కూల్ 13వ వార్షికోత్సవం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అభినందనీయమని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ లో గల నరసయ్య భవనంలో మంగళవారం
సృష్టి నవోదయ సైనిక్ స్కూల్ 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ నవోదయ, సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్న పాఠశాల యాజమాన్యం కృషిని ఆయన కొనియాడారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించలేని వారికి ఈ విద్యాసంస్థ అండగా నిలుస్తోందని ధర్ని మధుకర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నడుపుతున్న నవోదయ, సైనిక్ పాఠశాలల్లో సీట్లు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నవోదయలో సీట్లు సాధించిన అనుశ్రీ, దీప్తి, కృషిత, నవదీప్, ప్రణీత్, సంజావిలను మేయర్ ప్రత్యేకంగా సత్కరించారు. జాతీయ స్థాయి సైనిక్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన అంబాల రిహాన్ తేజ, పృథ్విలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సృష్టి డైరెక్టర్లు అంబాల రాజ్ కుమార్, భాస్కర్ రెడ్డి పాఠశాల విజయాలను వివరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల విద్యాధికారి పద్మజ, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్ర పాణి, జిల్లా ట్రెజరర్ కృష్ణారెడ్డి, ఉపేందర్, మండల ట్రస్మా అధ్యక్షులు మైదానం రామకృష్ణ, అమన్ ప్రసాద్, దేవన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.







