- బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్
- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్‌కు బీసీ సమాజ్ నాయకుల విన్నపం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహంతో పాటు బీసీ మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించేందుకు ప్రధాన కూడళ్లలో స్థలం కేటాయించాలని బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్‌కు గురువారం బీసీ సమాజ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పట్టణ నడిబొడ్డున మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప దార్శనీకుడు. అజ్ఞానమే అన్ని అనర్థాలకు మూలమని భావించి అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేశారు. విద్య ఒక్కటే సమస్యలకు పరిష్కారమని పంతొమ్మిదో శతాబ్దంలోనే వెనుకబడిన వర్గాల కోసం బడులు స్థాపించారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉన్నత విద్యావంతురాలిని చేశారు. ఆమె ద్వారా బాలికా విద్యకు పునాదులు వేశారు. కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఆయన చరిత్రను నేటి తరానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రధాన కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠిస్తేనే భావితరాలకు మహనీయుల గొప్పతనం తెలుస్తుంది. గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్‌లకు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా మేయర్ స్పందించి విగ్రహాల ఏర్పాటుకు స్థలాలను మంజూరు చేయాలి. మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా, ఘనంగా జరుపుకునే వీలు కల్పించాలి. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ నాయకులు కర్ణకంటి రవీందర్, మంచర్ల సదానందం, దుర్గం రాజేశం, ఎండి షఫీ, కలువల అంజన్న, అనంతుల మహేష్, రాజుగారి మహేష్, పల్లపు శీను, పొలిశెట్టి వినోద్ కుమార్, తాటిపాముల సమ్మన్న పాల్గొన్నారు.







