ఇందారం 1ఏ గని మేనేజర్ తీరుపై హెచ్ఎంఎస్ నిరసన
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇందారం 1ఏ గని మేనేజర్ కోటయ్య కార్మికులతో అసభ్యంగా మాట్లాడటం మానుకోవాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం గని ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనేజర్ తీరును ఎండగట్టారు. కార్మికులను కించపరుస్తూ మాట్లాడటం, అకారణంగా సస్పెన్షన్లు, ఛార్జ్ షీట్లు ఇస్తూ మానసిక వేధింపులకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు. గనిలో ఉత్పత్తి తగ్గడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. గనిలో తాగునీరు, వెంటిలేషన్, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేవని సారయ్య విమర్శించారు. నాణ్యమైన పనిముట్లు సరఫరా చేయకుండా ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేనేజర్ ఆపరేషన్ మీస నాగన్నకు వినతిపత్రం అందజేశారు. అసభ్యంగా ప్రవర్తించిన మేనేజర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, నాయకులు దుర్గ ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, కార్మికులు పాల్గొన్నారు.







