శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారుల సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ‘ప్రయాస్’ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సింగరేణి, సీఎంపీఎఫ్ (CMPF) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్ క్లెయిమ్‌ల పరిష్కారంపై కీలక చర్చలు జరిపారు. సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అంబటి భరత్ కుమార్‌కు ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ భరత్ కుమార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ల కోసం ‘సీ-కేర్స్’ (C-CARES) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో పెండింగ్‌లను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే ‘ప్రయాస్’ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. తాను గతంలో మైనింగ్ ఇంజనీర్‌గా పని చేసినందున కార్మికుల కష్టనష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. ఈపీఎఫ్ కన్నా సీఎంపీఎఫ్ ఎంతో మెరుగైనదని, ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను చిన్న చిన్న కారణాల కోసం విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ఆ పొదుపు మొత్తమే భవిష్యత్తులో కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సీఎంపీఎఫ్ అధికారులను సంప్రదించడం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు అధికారులే నేరుగా మన వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామమని అన్నారు. రీజినల్ కమిషనర్ భరత్ కుమార్ మైనింగ్ రంగం నుండి రావడం వల్ల క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇది పెండింగ్ క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం కావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియా పరిధిలోని సంక్షేమ అధికారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ (2) గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శి సందీప్, వివిధ గనుల సంక్షేమ అధికారులు, సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.







