- పోరాట సంఘాలపై కార్మికుల విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం: ఏఐటీయూసీ నాయకులు
- ఎస్సార్పీ-3 గనిపై ఏఐటీయూసీలో చేరిన పలువురు యువ మహిళా కార్మికులు, ఫిట్టర్లు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ నాయకత్వంలోని జేఏసీ ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులు, డిపార్ట్మెంట్లలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎస్సార్పీ-3, ఆర్.కె-7, ఎస్సార్పీ-1 తదితర గనులపై గేట్ మీటింగ్‌లు నిర్వహించి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సార్పీ-3 గనిపై బ్రాంచి కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఆర్.కె-7 గనిపై వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, ఎస్సార్పీ-1 గనిపై అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి మోత్కూరి కొమరయ్య
హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీసీ ఎన్నికల్లో మొత్తం 11 రీజియన్లలో ఏకంగా 9 రీజియన్లను ఏఐటీయూసీ నేతృత్వంలోని జేఏసీ కైవసం చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సంఘంగా అవతరించడం కార్మిక ఐక్యత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఏఐటీయూసీతో పాటు టీఎంయూ, ఎన్‌ఎంయూలు కలిసికట్టుగా సాగించిన ఉద్యమాలకు కార్మికులు పట్టం కట్టారని తెలిపారు. గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి హక్కులను కాలరాసే ప్రయత్నం చేసినా, ఆర్టీసీని కాపాడుకోవడానికి కార్మికులు నిలబడ్డారన్నారు. ఇటీవల నిర్వహించిన సమ్మెల ద్వారా వేతన సవరణ, డీఏల సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిందని, సీపీఐ శాసనసభాపక్ష నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు జరిగేలా విశేష కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విలీన ప్రక్రియ, వేతన సవరణలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎన్నికల స్ఫూర్తితో సింగరేణిలోనూ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాగా, ఎస్సార్పీ-3 గని వద్ద జరిగిన సభలో పలువురు యువ మహిళా కార్మికులు, ఫిట్టర్లు ఏఐటీయూసీ విధానాలకు ఆకర్షితులై యూనియన్‌లో చేరగా, నాయకులు వారికి ఎర్రజెండా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్ వంగరి రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, అడ్డు శ్రీనివాస్, సంపత్, జిల్లా సెక్రటరీ అఫ్రోజ్ ఖాన్, అధికార ప్రతినిధి రాజ్‌కుమార్, పిట్ సెక్రటరీలు మోతె లచ్చన్న, నర్సింగరావు, మురళి చౌదరి, సారయ్య, లక్ష్మణ్, రవి, సదానందం, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







