ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: అభ్యర్థులకు టీపీఏ ప్రత్యేక అవగాహన సదస్సు
మంచిర్యాల పద్మనాయక ఏసీ హాల్‌లో విద్యార్థులతో ప్రతిజ్ఞ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని కాలేజ్ రోడ్డు గల పద్మనాయక ఏసీ హాల్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణవేణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సహకారంతో,
కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరిగింది. “మనసును వినాలి.. మార్పును తేవాలి!” అనే నినాదంతో, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందేశం “Lived Experiences, Heard Real Voices, Real Change” ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో విద్యార్థులు ర్యాంకులు, కుటుంబ అంచనాలు, ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, అటువంటి సమయాల్లో సమయపాలన, తగిన విశ్రాంతి, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. “పరీక్ష మీ లక్ష్యం కావచ్చు కానీ.. అదే జీవితానికి తుది నిర్వచనం కాదు” అని, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానసిక ఆందోళన, నిరాశ కలిగినప్పుడు సంకోచించకుండా నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవడం బలహీనత కాదని, అది ఆరోగ్యం పట్ల తీసుకునే బాధ్యతాయుతమైన నిర్ణయమని స్పష్టం చేశారు. అనంతరం అభ్యర్థులతో మానసిక ఆరోగ్య పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీపీఏ జిల్లా అధ్యక్షుడు రంగు వేణు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన చైతన్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నారాయణరావు, టీపీఏ సలహాదారు మరియు కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత కస్తూరి పద్మ చరణ్, గుండేటి యోగేశ్వర్, విన్నర్ ఐకాన్ కాంపిటేటివ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







