- శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జీఎం మునిగంటి శ్రీనివాస్ దంపతులు
- లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, విభాగాలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. జీఎం కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి (మైసమ్మ) ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్–ఉమారాణి దంపతుల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు జరిగింది. నవరాత్రుల ఐదవ రోజైన గురువారం అమ్మవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలంకరణతో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణోత్సవం అనంతరం జీఎం కార్యాలయ ఉద్యోగులు, ఎస్ అండ్ పీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం, మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ… నూతనంగా ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారి కరుణాకటాక్షాలతో శ్రీరాంపూర్ ఏరియాతో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దసరా పర్వదినం రోజున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా జమ్మి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.







