దివంగత వేముల వికాస్ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆపదలో ఉన్న ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మిత్రుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం ఎంతో అభినందనీయమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్‌కు చెందిన వేముల వికాస్ నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన జ్ఞాపకార్థం గురువారం మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 34వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు సాగర్‌తో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే వేముల వికాస్‌ను కోల్పోవడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. స్నేహితుడి జ్ఞాపకార్థం యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శనీయమని, భవిష్యత్తులోనూ సమాజ హితం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పెంచాల వేణు, దివంగత వేముల వికాస్ మిత్ర బృందం సభ్యులు, రక్తదాతలు పాల్గొన్నారు.







