లక్సెట్టిపేట, ఆర్.కె న్యూస్: లక్సెట్టిపేట మండలం మిట్టపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బి.ఆర్.ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి సాగి ఉమాపతి రావుకు మద్దతుగా శనివారం నాడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ నాయకులు గ్రామంలో పర్యటిస్తూ, రాబోయే ఎన్నికల్లో సాగి ఉమాపతి రావు ‘ఉంగరం’ గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాభివృద్ధికి పాటుపడే ఉమాపతి రావుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, పట్టణ కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నస్పూర్ పట్టణ ప్రచార కార్యదర్శి ఆకునూరి సంపత్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
శ్రీ చైతన్యలో ఘనంగా నాసా కిట్స్ పంపిణీ
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గోపతి సురేష్
లక్షెట్టిపేట, ఆర్.కె న్యూస్: పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ‘నాసా’ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ విద్యార్థులకు తన చేతుల మీదుగా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అంతరిక్షంపై అవగాహన పెంచే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో భూమి నివాస యోగ్యం కాని పరిస్థితులు ఎదురైతే, అంతరిక్ష వాతావరణంపై అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు నాసా ప్రాజెక్టులైన ‘స్పేస్ కాలనీ’, ‘వాయుపుత్ర’లలో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నాసా ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్ట్స్, పెన్నులు, నోట్ బుక్స్ విద్యార్థులకు అందజేసి వారిని ప్రోత్సహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని మాట్లాడుతూ.. విద్యార్థులు నేర్చుకున్న కొత్త పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ జి. సుధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, జోనల్ ఏజీఎం అరవింద రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు.
ఇద్దరు దొంగలు అరెస్ట్, నగదు రికవరీ
వివరాలు వెల్లడించిన సిసిసి నస్పూర్ ఎస్ హెచ్ ఓ యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులను దొంగిలించిన కేసును సిసిసి నస్పూర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్ హెచ్ఓ యు. ఉపేందర్ రావు వెల్లడించారు. నస్పూర్ మండలం గాంధీనగర్‌కు చెందిన పురాణం రాంచందర్ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న షెడ్డులో నివాసం ఉంటూ, ఇంటి పనుల కోసం రూ. 94,000 నగదును ఒక ఇనుప పెట్టెలో దాచుకున్నాడు. కాగా, గత నెల 30వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షెడ్డులో చొరబడి ఆ డబ్బును అపహరించారు. బాధితుడు ఈనెల 1న ఉదయం లేచి చూసేసరికి డబ్బులు కనిపించకపోవడంతో వెంటనే సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ హెచ్ఓ ఉపేందర్ రావు దర్యాప్తు వేగవంతం చేశారు. సిసి టివి ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. మంచిర్యాల ఒడ్డెర కాలనీకి చెందిన బోసు తరుణ్, ఉప్పల రాకేష్, సంజయ్ అలియాస్ చిన్ని ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. పోలీసులు బోసు తరుణ్, ఉప్పల రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తులో రూ. 70,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు సంజయ్ అలియాస్ చిన్ని పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
సిసిసి నస్పూర్ ఎస్ హెచ్ ఓ యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయి వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక సిసిసి కార్నర్ వద్ద ఎస్ హెచ్ఓ యు. ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ఉపేందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమానాస్పదంగా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డుపైకి వాహనం తీసుకొచ్చే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి అన్ని రకాల ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. తనిఖీల సమయంలో పత్రాలు చూపించడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఏఎస్ఐలు బషీర్, శకుంతల, పోలీసు సిబ్బంది గోపాల్, వనిత, ఉష, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం
శ్రీరాంపూర్ ‘చాయ్ పే చర్చ’లో బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరెడ్లశ్రీనివాస్
భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం
పోటెత్తిన భక్తులు.. 21 జంటలతో సత్యనారాయణ సామూహిక వ్రతాలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన వెలసిన చారిత్రక ప్రసిద్ధ గౌతమేశ్వరాలయం గురువారం శివనామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన గురువారం కావడంతో ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 21 జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పూజలు చేశారు. గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడినట్లుగా పురాణ ప్రశస్తి కలిగిన ఈ ఆలయంలో, పార్వతీదేవి, నందీశ్వరుడు, వినాయకుడితో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వుత్తూరి దివ్య – రవీందర్ దంపతులు తమ కుమార్తె ‘శాన్విత’ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. పూర్ణిమ, ఏకాదశి, మరియు గురువారం వంటి పర్వదినాల్లో ఇక్కడ వ్రతాలు, అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది
బాధితుడికి అండగా నిలిచిన వైద్యులు, తోటి ఉద్యోగులు
రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: తోటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ఇటీవల తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డ్ అసిస్టెంట్లు, ఆయాలు, కార్యాలయ సిబ్బంది మరియు కాంట్రాక్టు ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు సేకరించారు. మొత్తం రూ. 52,200 విరాళాన్ని సిబ్బంది సమీకరించగా, అందులో కుటుంబ అత్యవసరాల నిమిత్తం రూ. 27,200 నగదును గురువారం డిప్యూటీ సీఎంవో (అడ్మిన్) ఎం. మధు కుమార్ చేతుల మీదుగా రాకేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మిగిలిన రూ. 25,000 మొత్తాన్ని రాకేష్ కోలుకునే సమయంలో అవసరాల కోసం వచ్చే నెలలో రెండో దఫాగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంవో మధు కుమార్ మాట్లాడుతూ.. ఏరియా ఆసుపత్రి సిబ్బంది కేవలం వైద్య సేవల్లోనే కాకుండా, సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవడంలోనూ ముందుంటారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని సిబ్బందిని అభినందించారు. మేకల రాజయ్య, సిరికొండ నాగేంద్ర భట్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్రన్ విజయలక్ష్మి, ఆఫీసు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండి మదర్ సాహెబ్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ఎస్ కె బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో రక్షణ చర్యలు కరువయ్యాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రెటరీ ఎస్.కె బాజీ సైదా ఆరోపించారు. గురువారం వారు ఆర్.కె 7 గనిని సందర్శించి, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గనిలో రక్షణ అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ప్రమాదంలో ఎస్డిఎల్ బండి కేబుల్ తాకి శ్రీనివాస్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఒకే లెవల్లో రెండు ఎస్డిఎల్ యంత్రాలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇది పూర్తిగా యాజమాన్య వైఫల్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి, గనిలో రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్పై విధుల్లో వాడుకుంటూ, ఇప్పుడు వారి అండర్ గ్రౌండ్ అలవెన్సులను రికవరీ చేయడం దారుణమని అన్నారు. కార్మికుల వేతనాల నుంచి చేస్తున్న రికవరీలు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, ఏరియా సెక్రటరీ సంపత్, పిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, నాయకులు శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జీరో పెండెన్సీ లక్ష్యంగా ‘ప్రయాస్’.. శ్రీరాంపూర్ ఏరియాకు 1332 రివైజ్డ్ పీపీఓలు
సీఎంపీఎఫ్ అధికారులు మా వద్దకు రావడం శుభపరిణామం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ‘జీరో పెండెన్సీ’ సాధించడమే లక్ష్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ‘ప్రయాస్-4’ సమావేశం జరిగింది. గురువారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్-2 గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ గోవర్ధన్, శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన 1332 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) కాపీలను జీఎం మునిగంటి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్ల కోసం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్ విధానంలో పెండింగ్ దరఖాస్తులను జీరో స్థాయికి తేవడమే ‘ప్రయాస్’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏరియా పరిధిలోని పెండింగ్ క్లేయిమ్స్‌ను సమీక్షించి, వాటిలో ఉన్న లోపాలను సవరించి వెంటనే పరిష్కరించాలని సంక్షేమ అధికారులకు సూచించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారం చాలా జటిలంగా ఉండేదని, అధికారులను సంప్రదించడం కూడా క్లిష్టంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం సీఎంపీఎఫ్ అధికారులే నేరుగా మన వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామం అని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ అధికారులు, సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లోనూ జీరో పెండెన్సీ లక్ష్యంగా మరిన్ని ప్రయాస్ మీటింగ్‌లు నిర్వహిస్తామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి సందీప్, వివిధ గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



