శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు-2023 నేపథ్యంలో ఈ నెల 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు అశోక్ కుమార్ సత్తార్, పవన్ సి.ఎస్, పోలీసు పరిశీలకులు ఆర్.ఇలంగో, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో 003–బెల్లంపల్లి రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) జి, రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, 004-మంచిర్యాల రిటర్నింగ్ అధికారి రాములు, 002 చెన్నూర్ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తులతో కలిసి నోడల్ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియలను పకడ్బంధీగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ రోజున పట్టణ ప్రాంతాల్లో 100 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, సంబంధిత ఏర్పాట్లను పోలింగ్ ముందు రోజు పరిశీలించుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వాలంటీర్లు, మల్టీపర్పస్ వర్కర్లను తీసుకోవాలని, ఎన్.ఎస్.ఎస్ వారిని వాలంటీర్లుగా తీసుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగులను, 80 సంవత్సరాల వయస్సు పైబడిన వయో వృద్ధులను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, తిరిగి వారి నివాసాలకు చేర్చేందుకు ఒక ఆటో ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ సామాగ్రిని పూర్తి స్థాయిలో పరీక్షించుకోవాలని, ప్రతి సెక్టార్ అధికారి వాహనంలో జి.పి.ఎస్. ఏర్పాటు చేసి ఉండాలని, ప్రతి సెక్టార్ అధికారి పరిధిలో అదనంగా 2 వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనానికి ముందు, వెనుక సెక్టార్ అధికారి వాహనం అని వ్రాసి ఉండాలని తెలిపారు. సెక్టార్ అధికారులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం చెక్ లిస్ట్ వచ్చిందని, ఇది ప్రతి సెక్టార్ అధికారి వద్ద ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు జారీ చేసిన ఈ.వి.ఎం. ప్రొటోకాల్ ప్రతి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉండాలని, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు, వాటి రూట్ మ్యాప్ అన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. వాహనాలు, వివిధ విభాగాల సిబ్బంది, వైద్య సిబ్బంది, వాలంటీర్లకు సంబంధించి కార్యచరణ రూపొందించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ప్రణాళిక, రూట్ మ్యాప్, లేబులింగ్, జి.పి.ఎస్. ఇతరత్రా ప్రక్రియ పూర్తి చేయాలని, అన్ని అంచెలలో పర్యవేక్షణ కమిటీలు పనితీరును పరిశీలిస్తాయని తెలిపారు. కమెన్స్ మెంట్ ఆఫ్ పోల్, మాక్ పోల్, ఈ.వి.ఎం.ల భర్తీ ఇతరత్రా కార్యక్రమాల కొరకు ఒక అధికారి ఉంటారని, వీటిని పర్యవేక్షిస్తూ నియోజకవర్గానికి ఒక పర్యవేక్షకుడు ఉంటారని తెలిపారు. పోలింగ్ సమయంలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించి అందించాలని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, 48 గంటల ప్రచార నిషేధిత సమయంలో పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదని, అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎక్కడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, అతిథి గృహాలు, ఇతరత్రా ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాల నిర్వహణ పై పోలీసు అధికారులు సంబంధిత అధికారుల సమన్వయంతో పర్యవేక్షించాలని, ఆఖరి గంటల ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్, వీడియో సర్వేయలెన్స్, వీడియో పరిశీలన ఇతర అన్ని ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తప్పనిసరి తనిఖీ చేయాలని, తనిఖీ ప్రక్రియను ఖచ్చితంగా వీడియో చిత్రీకరించాలని, అధిక మొత్తంలో నగదు తరలింపు, బదిలీలపై దృష్టి సారించాలని తెలిపారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఇతరులకు ఒక్కొక్క వాహనాన్ని అనుమతించడం జరుగుతుందని, ఒక్క వాహనంలో 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థికి సంబంధించి వాహనాలు తప్పనిసరిగా అభ్యర్థి మాత్రమే వినియోగించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, 200 మీటర్ల దాటిన తర్వాత ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చని, ఒక అభ్యర్థికి సంబంధించి ఇద్దరు మాత్రమే ఉండాలని, ఓటర్లకు అందించే ఓటరు సమాచార స్లిప్పులపై పార్టీలకు సంబంధించి ఎలాంటి గుర్తులు, వివరాలు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని తెలిపారు. 72 గంటల వ్యవధిలో ప్రలోభ పెట్టే అంశాలకు సంబంధించి ఏవైనా లభించినట్లయితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని, పోలీసు శాఖ, ఖర్చుల విభాగం అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సి, ఎం.పి.ఎఫ్. సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసు, సి.ఎం.పి.ఎఫ్., ఎన్నికల అధికారుల సమన్వయం కొరకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఖర్చులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులలోని చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, 24/7 విధులు నిర్వహించాలని, ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా లభించినట్లయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పంచనామా నిర్వహించి, సీజ్ చేయాలని, వీడియోగ్రఫీ చేయాలని, ఈ.వి.ఎం, తరలింపులో సి.ఎం.పి.ఎఫ్. సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని తెలిపారు, జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన 3 రిసెప్షన్ కేంద్రాల వద్ద అందరూ ఉండేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం. స్ట్రాంగ్ రూమ్ లు , పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, పోలీసు అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
మచ్చలేని నాయకుడు, నిజాయితీగల వ్యాపారి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పై ఐటీ దాడులు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకట స్వామికి వస్తున్న ప్రజాధారణ చూసి భయపడిన అధికార పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గలలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మాల మహానాడు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సాధికారత, అభివృద్ది కోసం దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని చిత్తశుద్దితో అమలు చేసిందని, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే దళితులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలు మధ్యలో వదిలివేస్తూ మోసం చేసిందన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొత్త పథకం తెరపైకి తెస్తూ, దళితులను వంచిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి మల్లయ్య, నాయకులు పొట్ట మధుకర్, దమ్మ నారాయణ, మినుముల శాంతి కుమార్, బైరం రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, సీసీసీ కార్నర్ బస్ స్టాప్ వద్ద పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన, అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తులు బుధవారం అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు గుడ్డేటి రామలింగంల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు గోదావరి పుణ్య స్నానం ఆచరించి, అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యలుచే అయ్యప్ప మాల ధరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు దీక్ష నియమాలు ఉపదేశించి నిష్టగా 41 రోజులు అయ్యప్ప స్వామి పూజలు చేసి ఇరుముడి దాల్చి శబరిమల వెళ్లాలని కోరారు. అయ్యప్ప స్వామి దీక్షతో భక్తులకు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న గురువారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో కేరళకు చెందిన సంజీవ నంబూద్రి గురుస్వామిచే అయ్యప్ప స్వాముల సామూహిక మహా పడిపూజ, అయ్యప్ప స్వాముల మహా సంగమం, అగ్ని గుండాల ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వంగ శ్రీనివాస్, సీహెచ్ సదానందం, వేణు, కొండల్ రెడ్డి, శ్రావణ్, బన్నీ, శేఖర్, బజ్జూరి, సురెందర్, రమేష్, చందర్, పప్పు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
– హామీలు అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం
– సింగరేణి తెలంగాణకు గుండెకాయ
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
– జై ఈటెల, సీఎం ఈటెల అంటూ బీజేపీ శ్రేణుల నినాదాలు
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ హామీలు అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి, యువకుడు, ఉన్నత విద్యావంతుడైన వెరబెల్లి రఘునాథ్ ను కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ గుండెకాయ లాంటిదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందని, ఓపెన్ కాస్ట్ లో మట్టి వెలికి తీయాల్సిన కంపెనీలు ప్రస్తుతం బొగ్గు కూడా వెలికి తీస్తున్నాయని అన్నారు. సింగరేణి ప్రాంత ఓట్లు కేసీఆర్ కు కావాలంటే సింగరేణికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా క్వింటాల్ వరి ధాన్యానికి తరుగు లేకుండా 3100 రూపాయలు చెల్లిస్తామన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనగానే కొంతమంది పార్టీని వీడారని, బీసీలు అంటే వారికి అంత చిన్న చూపా అని అన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా జై ఈటెల, సీఎం ఈటెల అంటూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానని, నిరుద్యోగ భృతి, ఇండ్ల స్థలాలు, రుణ మాఫీ చేస్తామని మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని, అర చేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకించు రకం కేసీఆర్ అని అన్నారు. హుజురాబాద్ లో తనను ఓడించడానికి 600 కోట్లు ఖర్చు చేశారని, దళిత బంధు పథకంలో భాగంగా రెండు వేల కోట్లు చెల్లించారన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి వచ్చిన పలువురికి ఈటల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం
– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్
– ఈ నెల 19న నస్పూర్ లో ఈటెల రాజేందర్ రోడ్ షో
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగురడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని నర్సయ్య భవన్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గెలిస్తే ఏం చేస్తాడో అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ గతంలో చెల్లని పట్టాలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేశాడన్నారు. స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తనను ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ గా ఇస్తానని, 9 భరోసాలు ఖచ్చితంగా అమలు చేస్తానని అన్నారు. నస్పూర్ లో ఉన్నత విద్యా ప్రమాణాలు గల ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడని, ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 19న నస్పూర్ లో జరిగే ఈటెల రాజేందర్ రోడ్ షో విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అగల్ డ్యూటీ రాజు, కృష్ణమూర్తి, సత్రం రమేష్, ఈర్ల సదానందం,పేరం రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన వాహన తనిఖీల్లో 7 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కె. స్వామినాథం వద్ద 7 లక్షల లభించాయని, సరైన ఆధారాలు చూపకపోవడంతో సదరు డబ్బును సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు అప్పగించినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
✅ కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్
✅ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి
✅ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ, ఇతర జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె5 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్మికులను కోరారు. కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులకు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీబీజీకేఎస్ లను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, జిఎం చర్చల ప్రతినిధులు పెట్టేం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ కార్యదర్శి రమేష్, పిట్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, నాయకులు రౌతు సత్యనారాయణ, మల్లేష్, శ్రీనివాసరావు, నీలం సదయ్య, అన్వేష్ రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మంచిర్యాల ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే నస్పూర్ మున్సిపాలిటీ నీ స్మార్ట్ సిటీగా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలేజ్ నస్పూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. విలేజ్ నస్పూర్ ప్రజలను ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు నిర్లక్ష్యం చేశాడని, స్థానికంగా సరైన రోడ్లు లేవని, తాగునీటి సమస్య పరిష్కరించడంలో మ్మెల్యే దివాకర్ రావు విఫలం అయ్యాడన్నారు. చెల్లని పట్టాలు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు నస్పూర్ పేద ప్రజలను మోసం చేశాడని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు, సరైన రహదారులు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అగల్ డ్యూటీ రాజు, జి.వి ఆనంద్, సత్రం రమేష్, ఈర్ల సదానందం, మిట్టపల్లి మొగిలి, సిరికొండ రాజు, కొరెపు మహేందర్, రనవేణి శ్రీను, కుర్రే చక్రి, మద్ది సుమన్, కొంతం మహేందర్, తాడూరి మహేష్, బద్రి శ్రీకాంత్, తిరుపతి, కట్కూరి సతీష్, బుసరపు తిరుపతి, కామ రాజు, కొండ్ర రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
– ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్
శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ అన్నారు. మంగళవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, 003 బెల్లంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్, డి.పి.సి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, 002-చెన్నూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు, 004-మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములు, ఎ.సి.పి. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుందని, ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని, ఉల్లంఘించినట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



