పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శనివారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను సమన్వయంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని అన్నారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కలుషితం అవుతుందని, అందుకు పూజా కార్యక్రమాలకు మట్టి వినాయకులను వినియోగించుకోవాలని కోరారు. ఆదిలాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాదు జిల్లాలోనే పెద్ద మొత్తంలో వినాయకుని ప్రతిష్టించడం జరుగుతుందని, ప్రజలందరూ భక్తి భావనతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టి వినాయకుల వినియోగం అవసరమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, బీసీ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధి పొందిన లబ్దిదారులు తాము ఎంచుకున్న యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎస్.సి. కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి. ఆనంద్ కుమార్ తెలిపారు. శనివారం ఎస్.సి. కార్పొరేషన్ జిల్లా ఈ.డి సిహెచ్. దుర్గాప్రసాద్ తో కలిసి దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని సెరామిక్స్ ఇండస్ట్రీ, భీమారం మండల కేంద్రంలోని ఫిష్ పాండ్, జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామంలోని టెంట్ హౌస్ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్.సి. కార్పొరేషన్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళిత బంధు పథకం మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల చొప్పున ఎంపిక చేసి దళిత బంధు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో లబ్ది పొందిన వారు తాము పొందిన నిధులను పెట్టుబడిగా వినియోగించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంకమట్టితో తయారు చేసిన మూడు వేల వినాయక ప్రతిమలను మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర శిక్షకుడు, పర్యావరణవేత్త, గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన నీరు కలుషితం అవుతుందని, అందరూ పర్యావరణహితమైన బంక మట్టి వినాయకులను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ. ఓ కార్యాలయం సూపరింటెండెంట్లు సత్యనారాయణ, నవీన్, రాజ్ కుమార్, హెచ్ ఎం వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది సిబ్బంది, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ మధు బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, కృష్ణవేణి విద్య సంస్థల అధినేత కస్తూరి పద్మ చరణ్, కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పర్వతి సుగుణాకర్, కస్తూరి సిద్ధార్థ్, సురకాని సత్యం తదితరులు పాల్గొన్నారు.
వెండి తెర పై బొగ్గు జీవితాలు
బొగ్గు భూమిలో లభించే ఖనిజం. ఇంధన ఉత్పత్తిలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. భారతదేశంలో దామోదర నది ఒడ్డున పశ్చిమ బెంగాల్ లో రాణి గంజ్ గని ద్వారా 1774 నుంచి మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపనిచే బొగ్గు తవ్వకాలు ప్రారంభించి, ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల ఆధీనంలో, దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా 1889 నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. బొగ్గు గని కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ప్రమాదాలు, అధికారులచే శ్రమ దోపిడీ పై బాలీవుడ్ లో 1980 దశకంలో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన “కాలా పత్తర్”తో మొదలైంది. ఝార్ఖండ్ లోని 1979 లో చసనాలా బొగ్గు గనిలో నీటి ప్రమాదంలో దాదాపు 300 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం పై “కాలా పత్తర్” సినిమా నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ కేవలం ప్రేమ, ముంబై మాఫియా, ఇండో-పాక్, ఇండో-చైనా యుద్దాలపై చిత్రాలు వచ్చాయి తప్ప బొగ్గు గనుల కార్మికుల గురించి ఏ చిత్రం రాలేదు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో మాఫియా ముఠాల వైరం పై 2014లో మనోజ్ బాజ్ పేయి, నవాజ్ ఉద్దీన్ సిధ్దికి నటించిన “గ్యాంగ్ ఆఫ్ వాస్నేపూర్” వినోద్ ఖన్నా, సునిల్ శెట్టి నటించిన “కోయాలంచల్” చిత్రం,శక్తి వంతమైన బొగ్గు మాఫియా చుట్టూ తిరుగుతుంది. ధన్ బాద్ లో అక్రమ బొగ్గు తవ్వకాలు, అక్రమ రవాణా గురించి పై చిత్రీకరించారు. రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ నటించిన “గుండే” చిత్రంలో నడుస్తున్న రైళ్లలో బొగ్గు దొంగతనం చేసి మాఫియా డాన్ గా మారిన ఇద్దరు మిత్రుల కథగా విడుదలై హిట్ అయ్యింది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా కృష్ణంరాజు నటించిన “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” కొత్తగూడెం ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, విజయశాంతి నటించిన చిత్రం “నిప్పు రవ్వ” కూడా బొగ్గు గని ప్రమాదం, దళారీల శ్రమ దోపిడీ గురించి తీసిందే. సింగరేణి బొగ్గు గని కార్మికుల నిజ జీవితాలను వెండి తెర పై “చీకటి సూర్యులు”గా చూపించిన ఘనత విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి కే దక్కుతుంది. ఈ సంవత్సరం నాని నటించిన “దసరా” చిత్రం కూడా బొగ్గు గని ప్రాంతంలో ఉన్న కార్మికుల కథే. ఇందులో పూర్తిగా సింగరేణి కార్మికుల యాసతో కూడిన భాష హైలెట్, అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో బొగ్గు గని చూపించినప్పటికీ బొగ్గు గని చిత్రాలు తక్కువగా వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న “సలార్” చిత్రంలో కూడా గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ దృశ్యాలు చిత్రీకరించారు. ప్రస్తుతం దేశం యావత్తు అక్టోబర్ 6 న విడుదల కాబడుతున్న అక్షయ్ కుమార్ నటిస్తున్న “మిషన్ రాణి గంజ్” చిత్రంలో 1989 నవంబర్ 13 న పశ్చిమ బెంగాల్ రాణి గంజ్ గని నీటి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఒక క్యాప్సిల్స్ ద్వారా బయటకు తీసుకొని రక్షించడం ఇందులో కథ. ఈ చిత్రం రిటైర్డ్ ఇంజినీర్, ఐ ఎస్ ఎం విద్యార్థి జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా నిర్మించారు. జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.వెండి తెర పై కాకుండా ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తా కపూర్ “ధన్ బాద్” వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు బొగ్గు ప్రాంతం అంటే చిన్న చూపు చూసిన వారు బొగ్గు ప్రాంతాలను షూటింగ్ స్పాట్ గా గుర్తించడం గొప్ప పరిణామం.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.
మాజీ ప్రభుత్వ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఓదెలు తిరిగి భారాసలో చేరారు. భారాసలో ఇమడలేకపోయిన నల్లాల ఓదెలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శుక్రవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భారత రాష్ట్ర సమితిని వీడుతున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. బీజేపీలో చేరుతున్నారని పుకార్లు కూడా వినిపించాయి. బీజేపీ లో టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేమని, పార్టీలో మాత్రం చేర్చుకుంటామని బీజేపీ పెద్దలు ఖరాకండిగా చెప్పడంతో బీజేపీలో చేరడానికి ఓదెలు ఆసక్తి చూపలేదని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. నల్లాల ఓదెలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ చెన్నూర్ టికెట్ కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు కొంతమంది నాయకులు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్, దొరగారి పల్లె ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మండల తహశీల్దార్ భోజన్నతో కలిసి మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నపిల్లలు, వయోవృద్ధుల ఉల్లాసం కొరకు మున్సిపాలిటీలలో పార్కుల ఏర్పాటులో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని రాముని చెరువు, రామనగర్ ప్రాంతాల్లో చేపట్టిన పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నిర్వహణ పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
నస్పూర్ మండలంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు ఐ.సి.ఎస్.సి బోర్డ్ ఆఫ్ ఢిల్లీ పేరుతో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్ మేరీస్ ప్లే స్కూల్ పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని టి.బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాల నడుస్తున్న సమయంలో బిల్డింగ్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ లో గల నెక్స్ట్ జనరేషన్ స్కూల్ 60 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అగ్నిమాపక అనుమతులు, ఆట స్థలం లేవని, చీకటి గదుల్లో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పద్మశాలి కాలనీలోని ఎస్ఆర్ డిజి స్కూల్ ఆన్ లైన్ లో స్కూల్ యూనిఫామ్, టీ షర్ట్స్, స్టేషనరీ తీసుకోవాలని ఒక యాప్ క్రియేట్ చేసి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారన్నారు. సంబంధిత పాఠశాలల పై తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కె.వై.సి చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ తమ వివరాలు చౌకధరల దుకాణాలకు వెళ్లి తప్పనిసరిగా ఈ-కె.వై.సి. చేయించుకోవాలని, ఈ మేరకు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు లోని ప్రతి లబ్దిదారుడి వేలిముద్రలు, వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2 లక్షల 3 వేల ఆహార భద్రత కార్డులలో 5 లక్షల 92 వేల మంది లబ్దిదారులకు 29 వేల 782 క్వింటాళ్ళు, 15 వేల 490 అంత్యోదయ కార్డులలో 47 వేల 880 మంది లబ్దిదారులకు 4 వేల 975 క్వింటాళ్ళు, 160 అన్నపూర్ణ అన్న యోజన కార్డులలో 161 మంది లబ్దిదారులకు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగే బోడ కాకరకాయ పోషకాల గని అని అనడంలో అతిశయోక్తి లేదు. బోడకాకరనే అడవి కాకర, ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. శరీరంలో సరైన రోగ నిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే కూరగాయలలో బోడ కాకరకాయ ఒకటి. కూరగాయలు అన్ని వేళలా దొరుకుతాయి. కానీ, బోడ కాకరకాయ మాత్రం అన్ని సమయాల్లో దొరకదు. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు బోడకాకర మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పండే ఈ బోడ కాకరకాయ కి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ప్రస్తుతం కొంతమంది ఔత్సాహిక రైతులు బోడ కాకరకాయ పంట సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోడ కాకరకాయ విరివిరిగా లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది సీజన్ కూరగాయ అవ్వడం వలన దీని ధర మిగతా కూరగాయలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కాకరకాయ ప్రస్తుతం మార్కెట్లో కిలో 300 రూపాయల వరకు ధర పలుకుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరకడం, ఎటువంటి మందులు పిచికారీ చేయకపోవడం, ఔషధ గుణాలు మెండుగా ఉండడంతో ధర కాస్త ఎక్కువైనా బోడ కాకరకాయలను తినడానికి చాలామంది భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తారు.
– బోడకాకరతో భలే ప్రయోజనాలు… ఎన్నో వ్యాధులకు చెక్…
కేవలం ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ కాకరకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బోడకాకరలో పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని, ఇందులో బి1 ,బి2, బి3 వంటి విటమిన్లు అధికంగా ఉంటాయని బోడ కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బోడ కాకర కాయలు మాత్రమే కాకుండా ఈ చెట్ల వేర్లు, ఆకుల రసాన్ని కూడా వివిధ రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. బోడ కాకరకాయలు తినడం వల్ల పోషకాలు మన శరీరానికి అంది తీవ్రమైన తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బోడకాకరలోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. గర్భిణులు బోడ కాకర కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో బోడ కాకరకాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.
– మటన్, చికెన్ దండగ, బోడ కాకరకాయ ఉండగా…
మటన్, చికెన్ కంటే అత్యధిక పోషకాలు బోడ కాకరకాయలో ఉంటాయి. శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. చాలామంది శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో ఇంటికి బంధువులు వస్తే ప్రత్యేకంగా ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు.
– చికెన్ కంటే అధిక ధరకు అమ్ముడుపోతున్న బోడ కాకరకాయ
మార్కెట్లో కిలో చికెన్ ధర 200 రూపాయలు ఉండగా, కోలో బోడ కాకరకాయ ధర 300 రూపాయలు ఉన్నప్పటికీ బోడ కాకరకాయ విశిష్టత తెలిసినవారు మాత్రం కొనడానికి వెనకడుగు వేయడం లేదు.
జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య-ఆరోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది డెంగ్యూ వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రతి మున్సిపల్ పరిధిలో వైద్యాధికారులు సమీక్ష నిర్వహించుకొని ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సిబ్బంది ద్వారా స్ప్రే, పైరిత్రివ్, పారిశుద్ధ్యం, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ సిబ్బంది, బ్రీడింగ్ చక్కర్లు అనుసంధానం చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఆదివారం ఉదయం 10.10 గం||లకు ప్రతి ఇంటిలో డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలని, ప్రతి రోజు డ్రై డే కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు తమ గ్రామాలలో నిర్వహించనున్న కార్యక్రమాల కార్యచరణ రూపొందించాలని, వైద్య-ఆరోగ్య శాఖ ద్వారా వైద్యాధికారులు ప్రభావిత గ్రామాలను ప్రతి రోజు సందర్శించాలని, సబ్-యూనిట్ అధికారులు ప్రతి రోజు అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలను జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారికి అందించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాలని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ పై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కీటక జనిత వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతివారం వ్యాధుల ప్రభావం పై సమీక్ష నిర్వహించాలని, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ చర్యలపై పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డాక్టర్ అనిత, డాక్టర్ నీరజ, డాక్టర్ ఫయాజ్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అరవింద్, డాక్టర్ భీష్మ, 11 82, డాక్టర్ అశోక్, మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి.లు, సబ్-యూనిట్ అధికారులు, సూపర్వైజర్లు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



