బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. నారాయణ మూర్తికి తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. ఆర్. నారాయణమూర్తి శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని జీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏరియా జనరల్ మేనేజర్ నారాయణ మూర్తికి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ నారాయణ మూర్తి చిత్రాలు తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయని, తెలంగాణ నేపథ్యంలో ఆయన తీసిన పలు చిత్రాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్వోటు జీఎం కె రఘు కుమార్, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎంలు పి అరవింద రావు, చిరంజీవులు, ఆర్కే 5,6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, క్వాలిటీ మేనేజర్ కే వెంకటేశ్వర్ రెడ్డి, టిబిజికెఎస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి, స్టార్ట కంట్రోల్ అధికారి అమర్ నాథ్ రెడ్డి, ఎస్టేట్స్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
2వ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు తెలిపారు. శుక్రవారం నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలపై మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్.టి.ఆర్. నగర్ కాలనీలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్నతో కలిసి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో 18, 19 సంవత్సరాల వయసు నిండిన గిరిజనుల వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఓటు హక్కు విలువ, ఎన్నికల సమయంలో ఓటు వినియోగం ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీహరి, వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత, బదావత్ ప్రకాష్, బూత్ స్థాయి అధికారి రేణుక, తోటి, మన్నె డ్రైవ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హిందువులకు ప్రకృతిలో ఉన్న నదులు, సముద్రాలు, చెట్లు, పుట్టలను, విగ్రహాలను ఆరాధించే సంప్రదాయం అనాదిగా వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యత కలదు. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు “స్వాతంత్య్రం నా జన్మ హక్కు” అని గర్జించిన మరాఠా సింహం బాల గంగాధర తిలక్ ప్రజలను ఐక్యపరచి దేశ భక్తి, దైవ భక్తి చాటడానికి భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. రాను రాను ఈ ఆచారం మహారాష్ట్రలోనే కాకుండా ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రాకింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో నిలబెట్టే గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం ఎత్తు పెంచుకోవడం ఒక ఆకర్షణ. కాలమాన పరిస్థితులు మారి నేడు వీధి, వీధిన ఎక్కడ చూసిన పోటీ పడి మట్టి విగ్రహాలు స్థాపించే స్థానంలో కలుషిత రంగులతో కూడిన విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది. గణేష్ నవ రాత్రుల్లో ఉత్సవాల కమిటీ వారు బలవంతంగా భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయడం మంచి పద్ధతి కాదు. భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. రంగు విగ్రహాల్లో వాడే పదార్థాలలో మెర్క్యురీ, లెడ్ ఉండటం వలన ఆరోగ్యానికి చెడు ప్రభావం కలుగజేస్తాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం పెరిగి నీటి జీవరాసులతో పాటు ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ఈ విగ్రహాలను మురికి కాలువలు, చెత్త కుండీలు మధ్య కాకుండా, ప్రజలకు ఆటంకం లేని ప్రదేశాల్లో నిలబెట్టాలి. రాత్రి పూట కేవలం భజనలు, కీర్తనలు చేయాలి. అంతే కాని శబ్ద కాలుష్యకారకమైన డి.జె, మైకులు, సినీ పాటలు అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తే చంటి పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్ట్రీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలంకారం కొరకు వాడే విద్యుత్ తీగలు, బల్బులు ఉపయోగిస్తే ఒక్కొక్కసారి అధిక వోల్టేజ్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే అన్నదానం, నైవేద్యం తయారు చేసేటప్పుడు కల్తీ లేని నూనె, నెయ్యి, శుభ్రమైన కూరగాయలు వాడాలి. ఈ గణేష్ నవ రాత్రులలో భక్తజన సందడి ఎక్కువ కనుక డెంగ్యూ, మలేరియా సోకకుండా జాగ్రత్త వహించాలి.
———————————————————————————————————-
✍ ఆళవందార్ వేణు మాధవ్
8686051752, హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా మెగాస్టార్ కి చెల్లెలిగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన భోళా శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందిన భోళా శంకర్ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలని సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాలో శ్రీముఖి, సుశాంత్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, రవి శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు.
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం సిహెచ్ పి రైల్వే సైడింగ్ మెయింటెనెన్స్ కార్మికులతో మాట్లాడుతూ, సకాలంలో జీతాలు చెల్లించేలా యాజమాన్యం కృషి చేయాలన్నారు. ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించాలని సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు వచ్చే అరకొర జీతాలు కూడా నెల చివరి వారంలో తప్ప ముందు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేసే పోరాట కార్యక్రమాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, బాపు, సది, సతీష్, వంశీ, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల వినియోగం యువత భవితకు నిరోధకం- జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మత్తు పదార్థాలు, మద్యపానీయాల వినియోగం యువత భవిష్యత్తుకు నిరోధకమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి జిల్లా పోలీస్, విద్య, వైద్య, అటవీ, వ్యవసాయ, సాంఘిక, ఆదాయ పన్ను, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎన్.సి.బి. ప్రతినిధులతో మత్తు పదార్థాల నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, మత్తు పదార్థాలు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మంచి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా వ్యవసాయ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రి-హాబిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలలో ఒకరోజు ప్రజావాణి కార్యక్రమంలో మత్తు పదార్థాల నియంత్రణ పై సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, సి.ఐ. రాజు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, వినాయక విగ్రహాలు పెట్టదలచిన వారు ఆన్ లైన్ లో తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని, ఎలక్ట్రిసిటీ, మైక్ అనుమతులు తీసుకోవాలన్నారు. మండపం దగ్గర భద్రత చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు నిర్వాహకులు ఉండాలని సూచనలు చేశారు. నిమజ్జనం రోజు డీజే పెట్టొద్దని, మండపం వద్ద రాత్రి వేళలో మద్యం,పేకాట లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరమైతే 100 కి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఆపిల్ పండ్ల సాగులో కాశ్మీర్ తర్వాత రెండో స్థానం హిమాచల్ ప్రదేశ్ దే. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ పండ్లపై కేంద్రం సుంకం తగ్గించడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆపిల్ పండ్ల ధరలు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు చేయలేక హిమాచల్ ప్రదేశ్ రైతులు చెట్లను నరికి వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి గంజాయి మొక్కల పెంపకం కొరకు పరిమిత సాగుకై అనుమతి ఇచ్చే ప్రతిపాదన సమర్థనీయం కాదు. ఇప్పటికే దేశంలో అక్రమ మాదక, మత్తు పదార్థాల సేవనం వల్ల యువత చెడిపోతోంది. గంజాయిని మూర్ఛ, దీర్ఘకాల నరాల వ్యాధిగ్రస్తుల ఉపశమనం కొరకు ఉపయోగించే మందుల తయారీకి ప్రత్యేక పర్యవేక్షణలో వాడుతుంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఔషధ, శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం గంజాయి సాగు రైతులకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇదే అదనుగా నేరగాళ్లు దొంగచాటుగా అక్రమంగా గంజాయి సాగు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ పొరుగు రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువని జగమెరిగిన సత్యం. మరొక పొరుగు రాష్ట్రం గుజరాత్ లో ఉన్న ఓడరేవుల నుంచి అక్రమ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డ వైనం తెలిసిందే. పనామా, కొలంబియా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కొకైన్, హెరాయిన్, నల్ల మందు లాంటి మాదక ద్రవ్యాల మొక్కల పెంపకం వలన అక్కడి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు బాధపడుతున్నారు. ఇదే అదనుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి గంజాయి సాగు కొరకు రైతుల పేరిట శతృదేశం పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటు దారులు ప్రవేశిస్తే దేశ భద్రతకు ప్రమాద ముప్పు పొంచి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులను ఆదుకోవాలంటే గంజాయి సాగుకు అనుమతి ఇవ్వకుండా అక్కడి నేల, వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వేరే పంటకు అనుమతి ఇవ్వాలి తప్ప గంజాయి సాగుకు అనుమతి ఇవ్వరాదు.
ఆళవందార్ వేణు మాధవ్
హైదరాబాద్, 8686051752
ఆర్.కె న్యూస్, నస్పూర్:
కార్మికుల సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూ టెక్ గని పై జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ సంఘం నాయకులు ఏనాడూ మాట్లాడలేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేసిన కనీసం సొంతింటి పథకం కోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని ప్రశ్నించారు. ఏరియర్స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మాట్లాడారని చెప్పే నాయకులు సంస్థకు రావలసిన బకాయిలు రాక ఆర్థికంగా నష్టపోతూ చివరికి ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి మారు పేర్లు సవరిస్తానని చెప్పిన ఇంతవరకు అమలు కాలేదని, 2011లో అలవెన్స్ ల పై ఐటీ మాఫీ ఒప్పందాన్ని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేస్తే అధికారులు అమలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతూ కూడా కార్మికులకు ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో టీబీజీకేఎస్ సంఘం చెప్పాలన్నారు. సిఐటియు నల్లబ్యాడ్జీలతో మొదలుపెట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు ఇతర సంఘాలు చేసిన నిరసనలతో యాజమాన్యం స్పందించి ఏరియర్స్ పై ప్రకటన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించే వరకు సింగరేణి నాయకులకు లాభాల గురించి ప్రకటన వస్తుందని తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సంస్థకు రావలసిన బకాయిలను ఇప్పించి లాభాల వాటా చెల్లింపు పై స్పష్టమైన తేదీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుల్ల బాలాజీ, గోదారి భాగ్యరాజ్, విడువల్లి శంకర్, వెంగళ శ్రీనివాస్, శ్రీపతి బాణేష్, అజయ్, ఆసంపల్లి అశోక్, పెరుక సదానందం, రాజయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్నెట్ లీడ్ పేర్లతో మాయమాటలు చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బియ్యాల ప్రశాంత్ అన్నారు. విద్యా అర్హత లేని టీచర్లతో పాఠశాల నిర్వహిస్తున్నారని, స్కూల్ లో బుక్స్, షూస్, సాక్స్, బెల్టు, ఐడి కార్డులను అమ్ముతున్న అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను తుంగలో తొక్కుతున్న లోటస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేనియెడల అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాధికారి కార్యాలయం ముట్టడికి వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాజు, ప్రశాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



