సోదరభావాన్ని పెంపొందించే పండుగ రక్షాబంధన్: ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని, మిఠాయిలు పంచుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను, పరస్పర గౌరవాన్ని పెంపొందించే గొప్ప సంప్రదాయం రక్షాబంధన్ అని వివరించారు. భారతీయ సంస్కృతిలో సోదరభావానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఇలాంటి సాంస్కృతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.







