మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
సీతారాంపల్లి జడ్పీ హైస్కూల్లో అల్పాహార పంపిణీ ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేపట్టిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎంతో అభినందనీయమని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ ఫలితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలోనే నాలుగో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కావడం హర్షణీయమని మేయర్ వివరించారు. తన స్వగ్రామమైన సీతారాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, హరే కృష్ణ ఫౌండేషన్‌కు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ధర్ని మల్లేష్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొక్కిరాల మోహన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







