- శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
- గత ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడి.. 2026-27 ఏడాదికి 64.30 లక్షల టన్నుల లక్ష్యం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగుల సమిష్టి కృషితోనే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధన సాధ్యమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో బుధవారం జీఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏరియా సాధించిన ప్రగతిని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 65.16 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 44,06,291 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఎస్సార్పీ 1, ఆర్.కె న్యూ టెక్ గనులు వంద శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించాయన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఓసీపీలు, గనుల కంటే 40 రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తి చేసిన ఆర్.కె న్యూ టెక్ గని ఏరియాకు గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. ఎస్సార్పీ 1 గని కూడా 22 రోజుల ముందే తన లక్ష్యాన్ని చేరుకుందని చెప్పారు. ఆర్.కె 5, ఆర్.కె 7 గనులు కూడా వంద శాతం ఉత్పత్తికి చేరువగా ఉన్నాయని మునిగంటి శ్రీనివాస్ వివరించారు. ఎస్సార్పీ 3, 3ఏ, ఐకె 1ఏ గనులు కూడా బొగ్గు ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలను కనబరిచాయన్నారు. ఉపరితల గనుల్లో కొన్ని ఓబీ కాంట్రాక్టుల ఒప్పంద సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో మట్టి తొలగింపు జరగలేదని స్పష్టం చేశారు. దీనివల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురై వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయామని తెలిపారు. భూగర్భ గనుల జీవిత కాలం పెరగడం వల్ల కార్మికులకు ఉపాధి భద్రత మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 2026-27 సంవత్సరానికి యాజమాన్యం 64.30 లక్షల టన్నుల లక్ష్యాన్ని విధించింది. అధికారులు, కార్మికులు ముందస్తు ప్రణాళికతో సమిష్టిగా కృషి చేసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి తమ ఏరియా అగ్రతాంబూలం ఇస్తోందని మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదంలో అంగవైకల్యం పొందిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కును అందజేశామని చెప్పారు. కారుణ్య నియామకాల ద్వారా మెడికల్ ఇన్ వాలిడేషన్ పొందిన 3828 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. ఏరియాలో తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. 277 మందికి ఎల్ఎస్పీ, 21 మందికి ఎంఎంసీ చెల్లింపులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 9734 మంది విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, రాజన్న, సీనియర్ పీవో ఎస్. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.





ఈనెల ఏడో తేదీన చేపట్టనున్న 24 గంటల నిరవధిక దీక్షకు సంబంధించిన గోడ ప్రతులను సమితి నాయకులతో కలిసి విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు సాగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశాయని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గుమ్ముల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు కూడా బీసీల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. హక్కుల సాధన కోసమే ఈనెల 7న నిరవధిక దీక్షకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. జిల్లాలోని బీసీ కుల సంఘాలు, బీసీ వాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. బీసీ సమాజం ఏకతాటిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గజ్జెల్లి వెంకటయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, నాయకులు వేముల అశోక్, మంచెర్ల సదానందం, చెలిమెల అంజయ్య, రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు.