- జిల్లా ఆర్జీపిఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి
- లక్షెట్టిపేటలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు.. 200 మందికి సర్టిఫికెట్ల పంపిణీ
లక్షెట్టిపేట, ఆర్.కె న్యూస్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఆర్జీపిఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి పేర్కొన్నారు. లక్షెట్టిపేటలోని గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు రెండు వందల మంది విద్యార్థులకు గడ్డం త్రిమూర్తి, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై సర్టిఫికెట్లను అందజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య కీలకమని, పేద విద్యార్థులకు దీనిని చేరువ చేయడంలో గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు బొప్పు సుమన్ తీసుకున్న చొరవ అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఉచిత శిక్షణ ద్వారా విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని సుమన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోక్ పర్సన్ బియ్యల తిరుపతి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత అభినయ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్, సన్నీ, సందేలా సురేష్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



