- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆదేశం
26 May 2026
- మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
- మున్సిపల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం: 83 యూనిట్ల రక్తం సేకరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతిఒక్కరు రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయనే రెడ్ క్రాస్ సొసైటీ అభ్యర్థనకు స్పందించి అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని మేయర్ తెలిపారు. రక్తదాన శిబిరానికి నగర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని, మొత్తం 83 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని, యువత ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రేమ్ సాయి, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, కార్మికులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సొన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సొన్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామస్తులకు సైబర్ నేరాలపై ఏఎస్ఐ దేవన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచితులు ఫోన్ చేసి ఓటిపి గానీ, సివివి నెంబర్ కానీ చెప్పకూడదని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగినప్పుడు వివరాలు చెబితే బ్యాంకు ఖాతాలోని డబ్బులను స్వాహా చేసే అవకాశం ఉందని, అందుకు ఎవరికి బ్యాంకు వివరాలను చెప్పకూడదని సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికుల షిఫ్ట్ సమయాలను మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్‌కు యూనియన్ ప్రతినిధులు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పెరుగుతున్న ఎండల వల్ల కార్మికుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ కార్మికులు విధినిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి అన్ని పని ప్రదేశాలలో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. ఎండల తీవ్రత తగ్గే వరకు పని వేళల్లో తగిన విశ్రాంతి విరామాలు ఇవ్వడంతో పాటు అవసరమైన చోట్ల తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, నాగభూషణం, గండి సతీష్, నల్లపు సత్తయ్య, వెంకటరెడ్డి, పెద్దయ్య, మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.



