- మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
- మున్సిపల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం: 83 యూనిట్ల రక్తం సేకరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతిఒక్కరు రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయనే రెడ్ క్రాస్ సొసైటీ అభ్యర్థనకు స్పందించి అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని మేయర్ తెలిపారు. రక్తదాన శిబిరానికి నగర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని, మొత్తం 83 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని, యువత ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రేమ్ సాయి, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, కార్మికులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








