- మంచిర్యాల 32వ డివిజన్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం
- స్థానిక బీఎల్ఓలకు దరఖాస్తులు అందజేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుకు సంబంధించిన పత్రాలను నింపి స్థానిక బీఎల్ఓలకు అందజేయాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఏఎస్ఆర్ఆర్ నగర్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటర్లకు సవరణ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను అందజేసి అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు జాబితాలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు, చిరునామా సవరణల కోసం పౌరులు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు సంపత్ రెడ్డి, కర్ర శ్రీను, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.



