సోన్, ఆర్.కె న్యూస్: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సోన్ మండల ఎంపీడీవో కె. రామకృష్ణ సూచించారు. శుక్రవారం మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఆయన పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైనేజీలు, రహదారులు, తాగునీటి వనరులను పరిశీలించి పరిశుభ్రతకు సంబంధించిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని అన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టి మొదటిసారి గ్రామానికి వచ్చిన ఎంపీడీవోను గ్రామ సర్పంచ్ గుర్రం రాము శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్ పాల్గొన్నారు.
3 July 2026
- రియాజ్ అహ్మద్, ఉదారి చంద్రమోహన్ గౌడ్
- ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
- ఈనెల 20 లోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు హెచ్చరిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ పోరాటం చేపట్టిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక మహిళా నాయకురాలు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని, ఈ క్రమంలో పలువురు ఉద్యమకారులకు గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ తెలంగాణ ద్రోహులకు సీట్లు, పదవులు ఇస్తోందని ఆరోపించారు. ఉప్పల్లో కవిత చేపట్టిన భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారీగా ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ కలిసి కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారని రియాజ్ అహ్మద్, చంద్రమోహన్ గౌడ్ ఆరోపించారు. కవిత చేపట్టిన ‘బాయిబాట’ కార్యక్రమానికి పోటీగా హరీష్ రావు సింగరేణి పర్యటనలు పెట్టుకున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గాయని, వందల కోట్ల సింగరేణి నిధులను హరీష్ రావు, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గాలకు మళ్లించుకున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మెతోనే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని, రాష్ట్ర ఏర్పాటులో కార్మికుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో కొత్త గనులు, ప్రాజెక్టులు ప్రారంభించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంపూర్ణ మద్దతు కల్వకుంట్ల కవితకు ఉందని, భవిష్యత్తులో ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే హెచ్ఎంఎస్, టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఎస్ఆర్పీ 3 ప్రమాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలి
గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 గనిలో జరిగిన ప్రమాదం సైడ్ ఫాల్ కాదని, అది ముమ్మాటికీ రూఫ్ ఫాల్ (పైకప్పు కూలడం) ప్రమాదమేనని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం గనుల్లో జరుగుతున్న పలు ప్రమాదాల వివరాలను బయటకు రాకుండా దాస్తోందని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన అధికారులను తక్షణమే బదిలీ చేసి, నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు ఏసీ గదుల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలోకి వచ్చి గనులను సందర్శించి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వి. అనిల్ రెడ్డి, నాయకులు ఎర్రం శెట్టి సాయి కుమార్, తుల అనిల్ కుమార్, కాసర్ల అశోక్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోరకొప్పుల మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాసకొండ సురేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు హారికరావు, ఉమ్మడి ఆదిలాబాద్ మీడియా ఇంచార్జి వేముల సాయి కుమార్ గౌడ్, నాయకులు రామ్మోహన్ చారి, జహీర్ ఖాన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) శుక్రవారం విద్యార్థినులకు యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఈసీఓ విజయలక్ష్మి, సెక్టోరల్ అధికారి-4 కృష్ణమూర్తి, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ యశోద ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నస్పూర్ స్పెషల్ ఆఫీసర్ ఎస్. మౌనిక, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.



