సోన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్
వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సోన్ మండల వ్యవసాయ అధికారి (ఏవో) వినోద్ కుమార్, మాదాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) రాజ్కుమార్లకు ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయ శాఖ పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, ఈ వానాకాలం సీజన్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో విశేష కృషి చేసినందుకు గాను వీరికి ఈ పురస్కారాలు దక్కాయి. ఉత్తమ పురస్కారాలు అందుకున్న అధికారులకు పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత అందుబాటులో ఉంటూ విశేష సేవలందించాలని వారు ఆకాంక్షించారు.




వినాయక చవితి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయ గణపతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద నిత్య పూజలతో పాటు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీపతి కల్పనా–రాములు గౌడ్ దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. గణనాథుని కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.