తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు
మందమర్రి, ఆర్.కె న్యూస్: మందమర్రిలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో పల్లె వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఎం. రమేష్ మాట్లాడుతూ, పండుగలు మన జీవన విధానానికి, సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన విద్యార్థులు పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో డీన్ రవికుమార్, ప్రైమరీ ఇంచార్జి నూకల సునీత, ప్రీ ప్రైమరీ ఇంచార్జి తిరుమల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.








