సింగరేణి హైస్కూల్లో ఘనంగా పదో తరగతి వీడ్కోలు వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈ లోకంలో అన్నింటికంటే శాశ్వతం స్నేహం మాత్రమేనని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా సీసీసీ సింగరేణి హైస్కూల్ పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేసి వంద శాతం ఫలితాలతో పాఠశాలకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కష్టనష్టాల్లో అందరికంటే ముందు అండగా నిలిచేది స్నేహితులు మాత్రమేనని గుర్తుచేశారు. పాఠశాల దశలో ఏర్పడే స్నేహబంధం ఎప్పటికీ మరువలేనిదని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ చదువులతో పోలిస్తే పదో తరగతిలో ఉండే అనుబంధం ఎంతో మధురమైనదని వివరించారు. విద్యార్థులు వీడ్కోలు వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం వార్షిక పరీక్షలపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు, గురువులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు సొంత ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. పరీక్షల పట్ల భయం వీడాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా సిద్ధమై ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పదో తరగతి విద్యార్థులు పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.







