శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
22 రోజుల ముందే లక్ష్యాన్ని చేరిన ఎస్సార్పీ 1 గని
సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనుల జోరు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి ద్వారానే మార్కెట్లో నిలదొక్కుకోగలమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్సార్పీ 1 గనిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపునకు 22 రోజుల ముందే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన అధికారులు, కార్మికులను అభినందించారు. రక్షణతో కూడిన ముందస్తు ఉత్పత్తి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రశంసించారు. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనులు సత్తా చాటుతున్నాయని ఆయన వివరించారు. ఆర్.కె న్యూటెక్ గని బాటలోనే ఎస్సార్పీ 1 సైతం నిర్ణీత గడువు కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషదాయకమని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 19 నాటికే 40 రోజుల ముందుగా లక్ష్యాన్ని సాధించి ఆర్.కె న్యూటెక్ గని సింగరేణిలోని అన్ని గనుల్లో మొదటి వరుసలో నిలిచిందని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో గని జీవితకాలం పెంపునకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై కార్మికులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మునిగంటి శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, ఎస్సార్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, గని మేనేజర్ ఆత్మారాం సహాని, రక్షణ అధికారి గోవిందచంద్ర ముర్ము, సంక్షేమ అధికారి అరుణ్ తేజ, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, సూపర్ వైజర్లు, మైనింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







